కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. వైద్యం కోసం కాకుండా మరే ఇతర రంగాల్లోనూ ద్రవరూప ఆక్సిజన్‌ను వినియోగించకూడదని కేంద్రం.. ఆదేశించింది. ఆక్సిజన్ తయారీ ప్లాంట్లు గరిష్ఠ స్థాయిలో ప్రాణవాయువును ఉత్పత్తి చేసి, తక్షణమే వైద్య వినియోగం కోసం అందజేయాలని తెలిపింది. దిల్లీ సహా అనేక రాష్ట్రాల్లో మెడికల్ ఆక్సిజన్ కొరత వేధిస్తున్న తరుణంలో ఆక్సిజన్ సరఫరాపై అధికారులతో కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా.. సమీక్ష నిర్వహించారు.
"వైద్యం మినహా మరే ఇతర రంగాల్లోనూ ద్రవరూప ఆక్సిజన్ వినియోగించకుండా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చర్యలు తీసుకోవాలి. కొవిడ్ ఉద్ధృతి కొనసాగుతున్న తరుణంలో అన్ని ఆక్సిజన్ తయారీ ప్లాంట్లు ప్రాణవాయువు ఉత్పత్తిని గరిష్ఠ స్థాయిలో పెంచాలి. అనంతరం ఆ ఆక్సిజన్‌ను వైద్య రంగం కోసం వినియోగించేలా.. ప్రభుత్వానికి తక్షణమే అందజేయాలి."
- అజయ్ భల్లా, కేంద్ర హోం శాఖ కార్యదర్శి