తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మద్యం కొనేవారిని 'పశువులు'గా చూడకండి' - మద్యం షాపులపై కేరళ హైకోర్టు ఆగ్రహం

కొవిడ్ నిబంధనలు తుంగలో తొక్కి మద్యం షాపుల వద్ద జనం గుమిగూడటంపై కేరళ హై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మద్యం కొనేవారితో పాటు అమ్మే సిబ్బందిని పశువులుగా పరిగణించకూడదని పేర్కొంది. వీరి భద్రత.. ఎక్సైజ్‌ శాఖదేనని స్పష్టం చేసింది. రద్దీని నియంత్రించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Crowd at liquor Shops
మద్యం షాపుల వద్ద జనం

By

Published : Sep 16, 2021, 9:57 PM IST

Updated : Sep 16, 2021, 10:49 PM IST

మద్యం దుకాణాల వద్ద భారీ రద్దీ ఉండడంపై కేరళ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మద్యం కొనుగోలు చేయడానికి వచ్చే వారితోపాటు అమ్మకాలు జరిపే బెవరేజ్‌ కార్పొరేషన్‌ సిబ్బందిని 'పశువులు'గా పరిగణించకుండా చూసుకునే బాధ్యత ఎక్సైజ్‌ శాఖపై ఉందని ఘాటుగా వ్యాఖ్యానించింది.

అంతేకాకుండా అలాంటి దృశ్యాలను ప్రజలు చూసి ఎగతాళి చేసే ఇబ్బందికర పరిస్థితులు తెచ్చుకోవద్దని సూచించింది. ఇందుకోసం మద్యం దుకాణాల వద్ద రద్దీని నియంత్రించడం సహా అక్కడి వచ్చే వారు క్రమశిక్షణతో మెలిగేలా చర్యలు తీసుకోవాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేరళ హైకోర్టు ఆదేశించింది.

మద్యం దుకాణాల వద్ద ప్రజలు బారులు తీరడం సహా రోడ్లపై ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగేలా చేస్తున్నారంటూ సెప్టెంబర్‌ 7వ తేదీన ఓ మహిళ కేరళ హైకోర్టుకు లేఖ రాసింది. మహిళలు, బాలికలు ఆ దుకాణాల ముందునుంచి వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాకుండా ఓ ప్రాంతంలో పార్కింగ్ కొరతతో సతమతమవుతోన్న బ్యాంకు సమీపానికే ఓ మద్యం దుకాణాన్ని మార్చినట్లు కోర్టు దృష్టికి తీసుకువెళ్లింది. ఆ లేఖపై విచారణ జరిపిన కేరళ హైకోర్టు.. మద్యం షాపుల దగ్గర జనాభాను నియంత్రించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు శూన్యమని ఆగ్రహం వ్యక్తం చేసింది. మద్యం దుకాణాల వద్ద రద్దీని స్వయంగా చూసిన తనకే చికాకు కలిగిందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ దేవాన్‌ రామచంద్రన్‌ పేర్కొన్నారు.

కొవిడ్‌ రావడం ఒకందుకు మంచిదే..!

మద్యం దుకాణాల నిర్వహణపై గతంలో (2017) ఇచ్చిన కోర్టు ఉత్తర్వులను అమలు చేయడానికి ప్రభుత్వానికి నాలుగేళ్లు పట్టిందని కేరళ హైకోర్టు తెలిపింది. అదికూడా కొవిడ్‌ విజృంభణతో కనీసం ప్రస్తుతం నిబంధనలు పాటిస్తున్నారని.. ఒకందుకు కొవిడ్‌ కూడా మంచే చేసిందని వ్యాఖ్యానించింది. ఇప్పటివరకు 50వరకు లేఖలు వచ్చాయన్న కోర్టు.. మహిళ ప్రస్తావించిన సమస్యలపై దృష్టి సారించాలని ఎక్సైజ్‌ శాఖకు సూచించింది. మరోసారి ఇలాంటి ఫిర్యాదులు వస్తే ఎక్సైజ్‌ శాఖ బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించింది.

ఇదీ చదవండి:Centre on Covid: 'రాబోయే 3 నెలలు జాగ్రత్తగా ఉండండి'

Last Updated : Sep 16, 2021, 10:49 PM IST

ABOUT THE AUTHOR

...view details