తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఈడీ అధికారాలపై 'సుప్రీం' కీలక తీర్పు.. ఇక వారికి కష్టమే! - మనీలాండరింగ్​ కేసు

SC Judgement On PMLA: ఈడీ అధికారాలను తప్పుపడుతూ సుప్రీంకోర్టులో పిటిషన్​ దాఖలు చేసిన కార్తీ చిదంబరం, మోహబూబా ముఫ్తీ వంటి నేతలకు ఎదురుదెబ్బ తగిలింది. ఈడీ అధికారాలను న్యాయస్థానం సమర్థించింది. కారణాలు చెప్పకుండానే నిందితులను అరెస్టు చేసే అధికారం ఈడీకి లేదన్న వాదనను కొట్టిపారేసింది. సుప్రీం తీర్పుపై అధికార భాజపా హర్షం వ్యక్తం చేయగా.. కాంగ్రెస్‌ నిరాశ వ్యక్తం చేసింది.

ed
ఈడీ

By

Published : Jul 27, 2022, 12:11 PM IST

Updated : Jul 28, 2022, 7:08 AM IST

SC Judgement On PMLA: నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) పరిధిలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారాలకు సంబంధించి సుప్రీంకోర్టు బుధవారం కీలక తీర్పు వెలువరించింది. పీఎంఎల్‌ఏ కింద అరెస్టులు, ఆస్తుల స్వాధీనం, జప్తు, సోదాలు చేపట్టేందుకు ఈడీకి ఉన్న అధికారాలను సమర్థించింది. నగదు అక్రమ చలామణి అనేది హీనమైన నేరమని.. దేశ ఆర్థిక, సామాజిక వ్యవస్థలకు దానితో ముప్పు పొంచి ఉంటుందని వ్యాఖ్యానించింది. ప్రతి కేసులో నిందితులకు ఈడీ అధికారులు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేసు సమాచార నివేదిక (ఈసీఐఆర్‌) కాపీని అందించాల్సిన అవసరం లేదనీ సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఏ కారణాలతో అరెస్టు చేస్తున్నారో వారికి తెలియజేస్తే సరిపోతుందని పేర్కొంది. పీఎంఎల్‌ఏలోని పలు నిబంధనల రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ కాంగ్రెస్‌ ఎంపీ కార్తి చిదంబరం సహా పలువురు వ్యక్తులు, సంస్థలు దాఖలు చేసిన 240కి పైగా పిటిషన్లపై జస్టిస్‌ ఎ.ఎం.ఖాన్‌విల్కర్‌, జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరి, జస్టిస్‌ సి.టి.రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ నిర్వహించి 545 పేజీల తీర్పును వెలువరించింది. రాజకీయ ప్రత్యర్థులపైకి ప్రయోగిస్తూ ఈడీని కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగపరుస్తోందంటూ దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నవేళ తాజా పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. సుప్రీం తీర్పుపై అధికార భాజపా హర్షం వ్యక్తం చేయగా.. కాంగ్రెస్‌ నిరాశ వ్యక్తం చేసింది.

నిరంకుశత్వం పరిధిలోకి రాదు
2002 నాటి పీఎంఎల్‌ఏలో సెక్షన్‌-19 ద్వారా ఈడీ అధికారులకు అరెస్టుకు సంబంధించిన అధికారాలు దఖలుపడ్డాయి. ఆ సెక్షన్‌ రాజ్యాంగబద్ధతను పిటిషనర్లు సవాలు చేయడాన్ని కోర్టు తిరస్కరించింది. అరెస్టు నుంచి మినహాయింపు పొందేలా ఆ సెక్షన్‌లో పలు రక్షణలూ ఉన్నాయని గుర్తుచేసింది. దానికింద చేసే అరెస్టులు నిరంకుశమైనవి, అన్యాయమైనవి కావని అభిప్రాయపడింది. బెయిలు మంజూరుకు సంబంధించి సెక్షన్‌-45లో ఉన్న జంట షరతులనూ ధర్మాసనం సమర్థించింది. నగదు అక్రమ చలామణితో సంబంధం ఉన్న ఆస్తుల జప్తునకు ఉద్దేశించిన సెక్షన్‌-5 కూడా రాజ్యాంగబద్ధమైనదేనని స్పష్టం చేసింది. నేరం తీవ్రత పెరగకుండా నివారించడంలో అది దోహదపడుతుందని పేర్కొంది. ప్రత్యేక కోర్టులతో విచారణ నిర్వహించదగిన నేరాల గురించి తెలియజేసే సెక్షన్‌-44 రాజ్యాంగబద్ధం కాదంటూ పిటిషనర్లు చేసిన వాదనతో సర్వోన్నత న్యాయస్థానం విభేదించింది. పీఎంఎల్‌ఏ పరిధిలోకి ఏయే నేరాలను తీసుకురావాలి, వేటిని మినహాయించాలి అన్నది శాసన వ్యవస్థకు సంబంధించిన విధానపరమైన అంశాల పరిధిలోకి వస్తుందని పేర్కొంది. సెక్షన్‌-24తో పాటు అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చినా.. సమాచారం ఇవ్వడంలో విఫలమైనా శిక్ష విధించొచ్చని సూచించే సెక్షన్‌-63 కూడా నిరంకుశత్వం పరిధిలోకి రాదని ధర్మాసనం స్పష్టం చేసింది.

ట్రైబ్యునల్‌లో ఖాళీలు భర్తీ చేయండి
పీఎంఎల్‌ఏ పరిధిలోని అప్పీలేట్‌ ట్రైబ్యునల్‌లో ఖాళీలు ఉండటం వల్ల అన్యాయం జరుగుతోందంటూ పిటిషనర్లు ఆందోళన వ్యక్తం చేయడంలో అర్థం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. సత్వరం ఖాళీలను భర్తీ చేయడం ద్వారా కార్యనిర్వాహక శాఖ దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పింది. ట్రైబ్యునల్‌ ఎల్లప్పుడూ పనిచేస్తూ.. బాధితులకు అందుబాటులో ఉండాలని వ్యాఖ్యానించింది. ట్రైబ్యునల్‌ సరిగా పనిచేయకపోవడంతో ప్రతిసారీ బాధితులు హైకోర్టులను ఆశ్రయించాల్సి వస్తోందని గుర్తుచేసింది. అది ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆ పార్టీ అగ్ర నేతలు రాహుల్‌ గాంధీ, పి.చిదంబరం, కార్తి చిదంబరం, శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అగ్రనేత ఫరూక్‌ అబ్దుల్లా, తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభిషేక్‌ బెనర్జీ, ఆప్‌ సీనియర్‌ నేత సత్యేందర్‌ జైన్‌ తదితరులపై ఈడీ నగదు అక్రమ చలామణి అభియోగాలు మోపిన నేపథ్యంలో తాజా తీర్పు ప్రాధాన్యం సంతరించుకుంది.

వారు పోలీసులు కాదు!
పీఎంఎల్‌ఏలో ప్రత్యేకంగా పేర్కొన్న నిబంధనల ప్రకారం ఈసీఐఆర్‌ను నేర శిక్షాస్మృతి (సీఆర్‌పీసీ) పరిధిలోని ఎఫ్‌ఐఆర్‌తో సమానంగా చూడలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘ఈసీఐఆర్‌ అనేది ఈడీ అంతర్గత డాక్యుమెంటు. ఒక నేరానికి సంబంధించి ఎఫ్‌ఐఆర్‌ నమోదు కాకున్నా.. సెక్షన్‌-48లో పేర్కొన్న ప్రకారం అధికారులు దానిపై విచారణ/దర్యాప్తు ప్రారంభించొచ్చు. తాత్కాలిక జప్తు వంటి చర్యలూ తీసుకోవచ్చు’’ అని పేర్కొంది. ఈడీ అధికారులు పూర్తిగా పోలీసుల తరహావారు కాదని న్యాయస్థానం పేర్కొంది. సమన్ల జారీ, సాక్ష్యాధారాల సమర్పణకు సంబంధించిన అధికారాలను నివేదించే సెక్షన్‌-50.. నేరాలపై ఆరాతీయడం/విచారణ నిర్వహించడం వంటి కోణంలోనే ఈడీ అధికారాలను తెలియజేసిందని వ్యాఖ్యానించింది. కఠిన దర్యాప్తునకు సంబంధించి ప్రస్తావించలేదని సూచించింది. కేవలం నేరం చేసి ఉండొచ్చన్న ఊహతో ఏ వ్యక్తినీ ఈడీ అధికారులు విచారించకూడదని స్పష్టం చేసింది.

  • పీఎంఎల్‌ఏ కింద అధికారులు నమోదు చేసే వాంగ్మూలాలు రాజ్యాంగంలోని ఆర్టికల్‌-20(3), ఆర్టికల్‌-21లను ఉల్లంఘించడం లేదని ధర్మాసనం తేల్చిచెప్పింది. తమ నేరాలకు తామే సాక్షులుగా ఉండేలా నిందితులను ఒత్తిడి చేయకూడదని ఆర్టికల్‌-20(3) చెబుతోంది. వ్యక్తిగత స్వేచ్ఛ, జీవిత పరిరక్షణ హక్కులను ఆర్టికల్‌-21 కల్పిస్తుంది.
  • నగదు అక్రమ చలామణికి సంబంధించిన అంశాలను ప్రస్తావించే సెక్షన్‌-3 (పీఎంఎల్‌ఏ).. కేవలం నేరం బయటపడ్డ చివరి చర్యలపైనే దృష్టిపెట్టదని, నేర క్రమంలోని అన్ని చర్యలపైనా ఆరా తీస్తుందని ధర్మాసనం స్పష్టం చేసింది. అక్రమాస్తులను కలిగి ఉండటం, దాచి ఉంచడం, వాటిని సముపార్జించుకోవడం, అక్రమాస్తులను సక్రమాస్తులుగా చూపేందుకు ప్రయత్నించడం వంటివన్నీ పీఎంఎల్‌ఏ కింద నేరాల పరిధిలోకే వస్తాయని తెలిపింది.
  • పీఎంఎల్‌ఏకు ఆర్థిక చట్టం రూపంలో పార్లమెంటు కొన్ని సవరణలు చేపట్టి ఉండాల్సింది కాదా అనే ప్రశ్నను తాము పరిశీలించలేదని ధర్మాసనం తెలిపింది. దానిపై నిర్ణయాన్ని ఏడుగురు న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనానికి వదిలేస్తున్నట్లు పేర్కొంది.

భాజపా హర్షం.. కాంగ్రెస్‌ నిరాశ

ఈడీ అధికారాల విషయంలో సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పును వెలువరించిందంటూ భాజపా సంతోషం వ్యక్తం చేసింది. పీఎంఎల్‌ఏపై రాజకీయ వాదనలకు, ప్రతిపక్షాల దుష్ప్రచారానికి ఇకనైనా తెరపడాల్సిన అవసరముందని పేర్కొంది. నిజాలను దాచిపెట్టే ప్రయత్నంలో భాగంగానే కాంగ్రెస్​ సత్యాగ్రహ పేరుతో నిరసనలు చేపడుతోందన్నారు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. "వారు ఓ కుటుంబాన్ని కాపాడేందుకు నిరసనలు చేస్తున్నారు.. దేశం కోసం కాదు. దర్యాప్తు సంస్థలకు గాంధీల కుటుంబం సమాధానం చెప్పాల్సిందే. కానీ వారు చట్టానికి అతీతం అని భావిస్తుంటారు. చట్టం తన పని తాను చేసుకుపోతోంది. కాంగ్రెస్​ ఆ కుటుంబాన్ని చట్టానికి అతీతంగా ఉంచేందుకు ప్రయత్నిస్తోంది. కానీ అది సాధ్యం కాదు. అందరం చట్టాన్ని గౌరవించాల్సిందే." అని నడ్డా పేర్కొన్నారు.
మరోవైపు కాంగ్రెస్‌ మాత్రం- అత్యున్నత న్యాయస్థానం తీర్పు నేపథ్యంలో ఇకపై ఈడీని కేంద్ర ప్రభుత్వం రాజకీయంగా దుర్వినియోగం చేసే ముప్పు మరింత పెరిగినట్లయిందంటూ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్యానికి ఈ తీర్పు మరిన్ని ఇక్కట్లు తెచ్చిపెట్టినట్లయిందని వ్యాఖ్యానించింది.

ఇదీ చూడండి:గొడుగులు వేసుకొని రైలు ప్రయాణం.. ఎక్కడ? ఎందుకో తెలుసా?

Last Updated : Jul 28, 2022, 7:08 AM IST

ABOUT THE AUTHOR

...view details