2010లో ప్రారంభమైన ఓ ఇంజినీరింగ్ కళాశాల పీజుకు బదులు విద్యార్థులు గోవులు ఇవ్వవచ్చనే ఆఫర్‌తో బాగా పాపులర్ అయింది. కానీ బ్యాంక్ నుంచి తీసుకున్న రుణం చెల్లించని కారణంగా 11ఏళ్లకే మూతపడే పరిస్థితి వచ్చింది. రూ.కోట్లు లోన్ తీసుకుని తిరిగి కట్టడం లేదని ఈ కాలేజ్‌ను ప్రైవేటు బ్యాంకు అధికారులు సీజ్ చేశారు.
బిహార్ బక్సర్‌లోని అరియాన్ గ్రామంలో ఉన్న ఈ కాలేజ్ పేరు విద్యాదాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్(VITM). డీఆర్డీఓ మాజీ శాస్త్రవేత్తలు ఎస్ కే సింగ్, అరుణ్ కుమార్ వర్మ, బెంగళూరుకు చెందిన డాక్టర్ మయూరి శ్రీవాత్సవ, సామాజిక కార్యకర్త లాల్ దేవ్ సింగ్ ఈ కళాశాలను ప్రమోట్ చేస్తున్నారు. పట్నాలోని ఆర్యబట్ట జ్ఞాన్ యూనివర్సిటీకి ఇది అనుబంధంగా ఉంది. దీన్ని స్థాపించినప్పుడు ఇంజినీరింగ్ ఫీజు చెల్లించలేని విద్యార్థులు 5 గోవులను ఇవ్వవచ్చని యాజమాన్యం ఇచ్చిన ఆఫర్.. చుట్టపక్కల గ్రామాల్లో జోరుగా చర్చనీయాంశమైంది. ఈ కాలేజ్‌లో ఇంజినీరింగ్ వార్షిక ఫీజు రూ.72,000. పేద విద్యార్థులు దీనికి బదులు మొదటి ఏడాదిలో రెండు గోవులు, మిగతా మూడు సంవత్సరాల్లో ఒక్కో గోవును ఇవ్వాల్సి ఉంటుంది.
మొదట్లో బాగానే ఉన్న ఈ కళాశాల.. ఇప్పుడు మూతపడే పరిస్థితి వచ్చింది. రూ.5.9కోట్లు రుణం తీసుకుని తిరిగి చెల్లించడం లేదనే కారణంతో దీన్ని బ్యాంక్ ఆఫ్ ఇండియా సీజ్ చేసింది. దీంతో 300మంది విద్యార్థుల భవిష్యత్ అయోమయంలో పడింది.
బక్సర్, వారణాసి మధ్య ఉన్న ఏకైక ఇంజినీరింగ్ కాలేజ్ తమదేనని కాలేజ్ ప్రమోటర్ ఎస్కే సింగ్ తెలిపారు. 'ఫీజుకు బదులు గోవులు' కాన్సెప్ట్ చక్కగానే పనిచేసిందని వెల్లడించారు. 2010లో తమ కాలేజ్‌లో మౌలిక సదుపాయాల కోసం బ్యాంక్ ఆఫ్ ఇండియా పట్నా బ్రాంచ్ తొలుత రూ.4.65 కోట్ల రుణం ఇచ్చిందని, 2011లో మరో రూ.10కోట్లg ఇస్తామని చేసినప్పటికీ నగదు మంజూరు నిలిపివేసిందని వివరించారు. సెక్యూరిటీ డిపాజిట్ కింద బ్యాంకులో రూ.15కోట్లు విలువ చేసే ఆస్తులు తనఖా పెట్టినట్లు చెప్పారు. ఫైనాన్స్ కారణంగా కాలేజ్ మూతపడుతుండటంపై ఆవేదన వ్యక్తం చేశారు.
'2012 వరకు ఈఎంఐ కట్టాం. 2013లో మరికొంత మొత్తాన్ని చెల్లించాం. మాకు ఇస్తామన్న ఆర్థిక సాయం రూ.10కోట్లు ఇవ్వకుండా బ్యాంకు రికవరీపై దృష్టి పెట్టింది. దీనివల్ల వందల మంది విద్యార్థుల భవిష్యత్ సందిగ్ధంలో పడింది.' అని సింగ్ పేర్కొన్నారు.