Engineer Stuck In Well In Punjab :70 అడుగుల లోతు గుంతలో చిక్కుకుపోయాడు ఓ ఇంజినీర్. దిల్లీ-జమ్ము-కట్‌ఢా ఎక్స్‌ప్రెస్ వే పనుల్లో భాగంగా విధులు నిర్వర్తిస్తున్న ఓ ఇంజినీర్ ప్రమాదవశాత్తు గుంతలో చిక్కుకుపోయాడు. ఈ ఘటన పంజాబ్‌లోని జలంధర్‌లో శనివారం రాత్రి 10 గంటలో సమయంలో జరిగింది. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది.. ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ఇదీ జరిగింది
సురేశ్ యాదవ్ అనే వ్యక్తి దిల్లీ-జమ్ము-కట్‌ఢా ఎక్స్‌ప్రెస్ వే ప్రాజెక్ట్‌లో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి 10 గంటల సమయంలో నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నాడు. కర్తార్‌పుర్ సమీపంలోని బస్రంపుర్ గ్రామంలో నిర్మాణంలో భాగంగా 70 అడుగులు లోతైన గుంతను తవ్వారు. ఈ సమయంలోనే ఇంజినీర్ సురేశ్‌తో పాటు మరో కార్మికుడు గుంతలోకి దిగి పనులను పరిశీలిస్తున్నారు. అయితే.. పైన ఉన్న మట్టి దిబ్బలు ఒక్కసారిగా కూలిపోయాయి. దీంతో అప్రమత్తమైన కార్మికుడు హుటాహుటిన బయటకు రాగా.. సురేశ్ మాత్రం అందులోనే చిక్కుకుపోయాడు. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది.. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు. రాత్రి నుంచి సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.
సహాయక చర్యలను పర్యవేక్షించిన మంత్రి
ఈ ప్రమాద సమాచారాన్ని తెలుసుకున్న రాష్ట్ర మంత్రి బల్కర్ సింగ్.. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వీలైనంత త్వరగా సహాయక చర్యలు చేపట్టి.. ఇంజినీర్‌ను రక్షించాలని సూచించారు. మంత్రితో పాటు రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షించారు.