తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'దావూద్​' కేసులో నవాబ్​ మాలిక్​ అరెస్ట్​- మార్చి 3 వరకు ఈడీ కస్టడీలో..

Nawab Malik
నవాబ్​ మాలిక్​ అరెస్ట్​

By

Published : Feb 23, 2022, 3:18 PM IST

Updated : Feb 23, 2022, 9:07 PM IST

15:15 February 23

'దావూద్​' కేసులో మహారాష్ట్ర మంత్రి నవాబ్​ మాలిక్​ అరెస్ట్​

Enforcement Directorate arrests NCP leader: ముంబయి అండర్‌వరల్డ్‌ వ్యవహారాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మహారాష్ట్ర మంత్రి నవాబ్‌ మాలిక్‌ను ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ అరెస్ట్​ చేసింది. అంతకుముందు అక్రమ నగదు లావాదేవీల నిరోధక చట్టం కింద నవాబ్‌ మాలిక్ వాంగ్మూలాన్ని నమోదుచేసినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. ఆయనను ఆరు గంటలపాటు ప్రశ్నించిన అనంతరం అరెస్టుపై ప్రకటన చేశారు. విచారణకు నవాబ్​ మాలిక్​ సహకరించటం లేదని.. అందుకే అరెస్ట్​ చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. ముంబయి పీఎంఎల్​ఏ కోర్టులో హాజరుపరిచి.. ఈడీ కస్టడీకి అనుమతి కోరగా మార్చి 3 వరకు కస్టడీ విధించింది.

కస్టడీ సమయంలో తన మెడిసిన్స్​ తీసుకెళ్లేందుకు.. ఇంటి భోజనం తెప్పించుకునేందుకు నవాబ్​ మాలిక్​కు కోర్టు అనుమతించింది.

భయపడేది లేదు..

"అరెస్ట్​ చేశారు.. అయినా భయపడేది లేదు. పోరాడి విజయం సాధిస్తాం" అని అన్నారు మాలిక్. అరెస్ట్​ అనంతరం వైద్య పరీక్షల కోసం తరలిస్తున్న క్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

ఎన్​సీపీ కార్యకర్తల ఆందోళన..

నవాబ్​ మాలిక్​ను అరెస్ట్​ నేపథ్యంలో ముంబయిలోని ఈడీ కార్యాలయానికి భారీ తరలివచ్చారు ఎన్​సీపీ కార్యకర్తలు. అరెస్ట్​కు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు.

తెల్లవారు జామున 4 గంటలకే..

బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు ముంబయిలోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు మాలిక్​. ఉదయం 7 గంటలకు విచారణ చేపట్టారు. అండర్​వరల్డ్​ డాన్​ దావూద్​ అక్రమ ఆస్తులు, కొద్ది రోజుల క్రితం అరెస్టయిన దావూద్​ సోదరుడు ఇబ్రహిం కస్కర్​తో సహా పలు అనుమానిత నిందితులతో సంబంధాలపై ప్రశ్నించినట్లు ఈడీ వర్గాలు పేర్కొన్నాయి. దావూద్​, అతని అనుచరుల కోసం పలు చోట్ల వివాదాస్పద ఆస్తులను నవాబ్​ మాలిక్​ కొనుగోలు చేసినట్లు ఇటీవల ఆరోపణలు వచ్చాయి. దీంతో దావూద్​కు సంబంధించిన ప్రతి చిన్న అంశాన్ని నిశితంగా పరిశీలిస్తోంది ఈడీ. ఇబ్రహిం కస్కర్​ను అరెస్ట్​ చేసిన తర్వాత.. విచారణలో కీలక రహస్యాలను ఈడీకి వివరించినట్లు అధికారులు తెలిపారు. ఆ విషయాల ఆధారంగానే నవాబ్​ మాలిక్​కు నోటీసులు ఇచ్చి విచారణకు ఆదేశించినట్లు తెప్పారు.

ఈ కేసు దర్యాప్తులో భాగంగా కొంతకాలం క్రితం ముంబయి, పుణె సహా పలు ప్రదేశాల్లో దాడులు నిర్వహించింది ఈడీ. ముఖ్యమైన పత్రాలు స్వాధీనం చేసుకుంది. అందులో అక్రమ ఆస్తులకు సంబంధించిన పత్రాలు, అనుమానాస్పద బ్యాంకింగ్​ లావాదేవీల పత్రాలు ఉన్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. ఈ పత్రాలపైనే మాలిక్​ను ప్రశ్నించినట్లు పేర్కొన్నారు. నవాబ్​ మాలిక్​ ఈడీ కార్యాలయానికి చేరుకున్న సమయం నుంచి ఆయన నివాసాన్ని తమ అధీనంలోకి తీసుకున్నట్లు చెప్పారు అధికారులు.

అధికార దుర్వినియోగమే: ఎన్​సీపీ

మహారాష్ట్ర మంత్రి నవాబ్​ మాలిక్​ను ఈడీ అరెస్ట్​ చేసిన క్రమంలో భాజపాపై విమర్శలు గుప్పించింది నేషనలిస్ట్​ కాంగ్రెస్​ పార్టీ. అధికార దుర్వినియోగానికి మరో ఉదాహరణగా పేర్కొంది. కొందరు చేసిన తప్పులను ఎత్తిచూపుతున్నందునే ఆయన గొంతును నొక్కేందుకు చేస్తున్న ప్రయత్నాలని ఆరోపించింది. ఆయన బహిరంగంగా మాట్లాడినందుకు ఇలాంటి చర్యలు ముందుగానే ఊహించామన్నారు ఎన్​సీపీ అధినేత శరద్​ పవార్​. రాజకీయ ప్రత్యర్థులను కట్టడి చేయాలని వ్యూహాలపై కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రతీకార రాజకీయంగా చూడొద్దు: భాజపా

ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ చర్యలను ప్రతీకార రాజకీయాలుగా అభివర్ణించొద్దని స్పష్టం చేసింది భాజపా రాష్ట్ర విభాగం. అధికార పార్టీ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు భావిస్తే.. కోర్టుకు వెళ్లాలని సూచించింది. ఈడీ అరెస్ట్​ చేసిన క్రమంలో మాలిక్​కు మంత్రివర్గంలో ఉండే హక్కులేదని, ఆయన రాజీనామా చేయాలని డిమాండ్​ చేసింది.

Last Updated : Feb 23, 2022, 9:07 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details