Gurugram murder: హరియాణా గురుగ్రామ్‌లోని రేవాడీలో ఓ హత్య కేసును 7 నెలల తర్వాత ఛేదించారు పోలీసులు. ఈ కేసుకు సంబంధించి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరు తప్పుదోవ పట్టించడం వల్లే దర్యాప్తు ఆలస్యమైందని శుక్రవారం తెలిపారు. ఆక్టోబర్ నుంచి దర్యాప్తు చేస్తున్న హత్య కేసు ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చిందని చెప్పారు. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. గతేడాది అక్టోబర్‌లో హత్యకు గురైన వ్యక్తి పేరు అజయ్ అలియాస్ గోలు. సెక్టార్ 52లోని బాలాజీ మెడికల్ స్టోర్‌లో హెల్పర్‌గా పనిచేసేవాడు. గతేడాది ఈ దుకాణంలో మూడు మొబైల్ ఫోన్లు చోరీ అయ్యాయి. వాటిని అజయ్ దొంగిలించి ఉంటాడని మెడికల్ షాపు యజమాని అమిత్ అనుమానించాడు. దీంతో అజయ్‌ను మూడు రోజుల పాటు నిర్బంధించి హింసించాడు. ఆ తర్వాత అజయ్ తప్పించుకున్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు అక్టోబర్ 8న అజయ్‌ను మళ్లీ తీసుకెళ్లి నిర్బంధించాడు అమిత్. ఈసారి అజయ్ తండ్రి సత్యపాల్‌ను కూడా బంధించాడు. మూడు రోజుల తర్వాత అజయ్ తండ్రిని విడిచిపెట్టాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు తన కుమారుడి ఆచూకీ తెలపాలని సత్యపాల్ అమిత్‌కు ఫోన్ చేశాడు. అయితే అజయ్ తన వద్ద నుంచి తప్పించుకున్నాడని అమిత్ బదులిచ్చాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఇదే సమాధానం చెప్పాడు.