1975లో ప్రధాని హోదాలో ఇందిరాగాంధీ దేశంలో అత్యయిక పరిస్థితి విధిస్తూ తీసుకున్న నిర్ణయం తప్పేనని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. అమెరికాలోని కార్నెల్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ కౌశిక్ బసుతో జరిగిన వెబినార్‌లో ఆయన పాల్గొన్నారు. వివిధ అంశాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. అయితే వ్యవస్థలను ఆక్రమించాలని కాంగ్రెస్ ఎప్పటికీ ప్రయత్నించలేదని స్పష్టంచేశారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతల అసమ్మతి స్వరాలపై రాహుల్ పరోక్షంగా స్పందించారు. పార్టీలో అంతర్గత ఎన్నికలు నిర్వహించాలని కోరితే తనపైనే అనేక విమర్శలు చేశారని గుర్తు చేశారు. భాజపా హయాంలో ఆర్ఎస్ఎస్ వ్యవస్థలను తమ వ్యక్తులతో నింపుతోందని ఆరోపించారు.
అత్యవసర పరిస్థితి తప్పు. కచ్చితంగా అది తప్పే. మా నానమ్మ(ఇందిరా గాంధీ) కూడా అదే చెప్పారు. కానీ అత్యయిక స్థితి ఉన్నప్పుడు జరిగిన దానికి ఇప్పుడు జరుగుతున్న దానికి ప్రాథమికమైన తేడా ఉంది. భారతదేశ వ్యవస్థలను ఆక్రమించుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రయత్నించలేదు. నిజానికి కాంగ్రెస్ పార్టీకి ఆ సత్తా కూడా లేదు. కాంగ్రెస్ పార్టీ నిర్మాణం కూడా దానికి అంగీకరించదు. అలా చేయాలని మేం భావించినా చేయలేము. వ్యవస్థలను ఆర్.ఎస్.ఎస్ తమ వ్యక్తులతో నింపుతోంది. భాజపాను ఓడించినా వ్యవస్థల నిర్మాణంలో వారి వ్యక్తుల నుంచి మాత్రం విముక్తి లభించదు.