తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Satyagraha movement: అశక్తత కాదు.. మన ఆత్మబలమే సత్యాగ్రహం! - ఆజాదీ కా అమృత్​

ఆంగ్లేయులు బలహీనుడి అశక్త ఆయుధంగా గేలిచేసినా.. 'సత్యాగ్రహం' (Satyagraha movement) ప్రపంచానికి ఆదర్శంగా మారింది. అసాధ్యాలనుకున్న వాటిని సుసాధ్యం చేసింది. మహాత్మాగాంధీ మానసపుత్రికైన ఈ సత్యాగ్రహం ఆవిర్భావం ఆసక్తికరం! అదెలాగో తెలుసుకోండి.

Satyagraha movement
సత్యాగ్రహ ఆవిర్భావం

By

Published : Sep 9, 2021, 8:15 AM IST

సత్యాగ్రహం... భారత స్వాతంత్య్రోద్యమాన్నే కాకుండా మార్టిన్‌ లూథర్‌ కింగ్‌, మండేలాలాంటి మహామహుల్ని సైతం ప్రభావితం చేసింది. అసాధ్యాలనుకున్న వాటిని సుసాధ్యం చేసిన ఆయుధం సత్యాగ్రహం! మహాత్మాగాంధీ మానసపుత్రికైన ఈ సత్యాగ్రహం ఆవిర్భావం ఆసక్తికరం! దక్షిణాఫ్రికాలో 1906లో సెప్టెంబరు 9-11 మధ్య సత్యాగ్రహం శ్రీకారం చుట్టుకుంది. తొలుత గాంధీజీకీ ఈ పేరు తట్టలేదు. పత్రిక ద్వారా ఓ పోటీ పెట్టి, ప్రజల అభిప్రాయాలు సేకరించి... వారి నుంచి వచ్చిన ఓ పేరును మార్చి పెట్టిందే సత్యాగ్రహం!

భారత్‌ స్వాతంత్య్రోద్యమంలోకి దూకకముందు గాంధీజీ ఉద్యోగ (లాయర్‌) నిమిత్తం దక్షిణాఫ్రికాలో ఉండేవారు. అక్కడా తెల్లదొరలదే ప్రభుత్వం. అక్కడ పనిచేస్తున్న భారతీయులపై (చాలామంది బానిసలుగా వెళ్ళినవారే) దక్షిణాఫ్రికా బ్రిటిష్‌ ప్రభుత్వ దమనకాండ, వివక్ష విపరీతంగా ఉండేది. ఎంతగా అంటే ఫుట్‌పాత్‌లపై నడవటానికి కూడా ఆంక్షలు విధించేంతగా! అనుమతి ఉంటేనే రాత్రి 9 తర్వాత ఫుట్‌పాత్‌లపై భారతీయులను నడవనిచ్చేవారు. టికెట్‌కొన్నా భారతీయులను రైళ్ళలో మొదటి తరగతిలో కూర్చోనిచ్చేవారు కాదు. లాయర్‌గా వెళ్ళిన గాంధీజీ స్థానిక పరిస్థితుల ప్రభావంతో క్రమంగా అక్కడి రాజకీయాల్లో అడుగుపెట్టాల్సి వచ్చింది. నాటల్‌ ఇండియన్‌ కాంగ్రెస్‌, బ్రిటిష్‌ ఇండియన్‌ అసోసియేషన్‌లలో ఆయన క్రియాశీలక పాత్ర పోషించారు. భారతీయుల సమస్యలు, వారి స్థితిగతులు, హక్కుల డిమాండ్లు వినిపించటానికి 1903లో ఇండియన్‌ ఒపీనియన్‌ పత్రిక ఆరంభించారు.

1906లో భారతీయులను అవమానించేలా దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఓ నల్లచట్టాన్ని తీసుకొచ్చింది. దీనికి వ్యతిరేకంగా జొహానెస్‌బర్గ్‌లోని ఓల్డ్‌ ఎంపైర్‌ థియేటర్‌లో గాంధీజీ ఆధ్వర్యంలో భారీ సభ జరిగింది. దాదాపు 3వేల మంది భారతీయులు హాజరయ్యారు. ఆయుధాలు లేకుండా, బ్రిటిష్‌తో పోరాడి, వారిని ఒప్పించి మన హక్కులు సాధించుకోవాలంటూ గాంధీ ఇచ్చిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. అందరిలోనూ ఓ ఉద్యమ ఊపుతీసుకొచ్చింది.

"సత్యాగ్రహం అంటే అశక్తత కాదు.. మన ఆత్మబలం. లక్ష్యం ఉన్నతంగా ఉండటమే కాదు.. దాన్ని సాధించే మార్గం కూడా అంతే ఉన్నతంగా ఉండాలి. ప్రత్యర్థిపై ఎలాంటి ఆగ్రహం, శత్రుత్వం, కోపం లేకుండా సత్యానికి కట్టుబడి వారిని కూడా మనదారిలోకి తెచ్చుకోవటం సత్యాగ్రహం ప్రత్యేకత!"

-గాంధీజీ

ఉద్యమానికి ఏం పేరు పెట్టాలో ఎవరికీ తెలియలేదు. గాంధీజీ దీన్ని తొలుత 'పాసివ్‌ రెసిస్టెన్స్‌' (నిష్క్రియ ప్రతిఘటన)గా అభివర్ణించారు. చాలామందికి అర్థం కాకపోవటం; ఆంగ్లేయులు దీన్ని బలహీనుడి అశక్త ఆయుధంగా గేలిచేయటంతో పాటు తమ ఉద్యమానికి ఆంగ్ల పదం వాడటాన్ని గాంధీజీయే నామోషీగా భావించారు. దీంతో... ఉద్యమానికి మంచి పేరు సూచించాల్సిందిగా ఇండియన్‌ ఒపీనియన్‌ పత్రిక ద్వారా పోటీ పెట్టారు. ఈ పోటీలో గాంధీజీ సమీప బంధువు మగన్‌లాల్‌ గాంధీ- సదాగ్రహ అనే పేరుని సూచించారు. ఉద్యమ లక్ష్యానికి కాస్త దగ్గరగా ఉన్న ఆ పేరును గాంధీజీ సత్యాగ్రహంగా (సత్యానికి కట్టుబడి ఉండటం) మార్చి... దానికి పరిపూర్ణతనిచ్చారు.

జొహానెస్‌బర్గ్‌లో సత్యం, సమానత్వాల ప్రాతిపదికన ఆయన నిర్మించిన సత్యాగ్రహ కుటీరం ఇప్పటికీ ఉందక్కడ! తొలుత బాగానే ఉందనిపించినా గాంధీజీ సత్యాగ్రహానికి అక్కడా అవాంతరాలు ఎదురయ్యాయి. భారతీయులే ఆయనపై దాడి చేశారు. కానీ చివరకు మళ్ళీ సత్యం అర్థమై దారికొచ్చారు. మొత్తానికి గాంధీజీ సత్యాగ్రహం కారణంగా 1914లో భారతీయుల డిమాండ్లకు దక్షిణాఫ్రికా ప్రభుత్వం తలొగ్గింది. అలా దక్షిణాఫ్రికాలో విజయవంతమైన ఆ అహింసా ఆయుధాన్ని తీసుకొని భారత్‌లో అడుగుపెట్టారు గాంధీజీ!

ఇదీ చదవండి:బోస్‌ కోసం భర్తను చంపిన సమరయోధురాలు

ABOUT THE AUTHOR

...view details