తమిళనాడులోని నీలగిరి జిల్లా మసినగుడి ప్రాంతంలో ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన పులిని అటవీ సిబ్బంది నిర్బంధించారు. 22 రోజులపాటు సాగిన వేట విజయవంతమైంది. మసినగుడి నుంచి తెప్పకాడుకు వెళ్లే మార్గంలో గురువారం రాత్రి ఈ పులి కనిపించింది. అనంతరం శుక్రవారం ఉదయం దీన్ని మోయార్, సింగర ప్రాంతంలో గుర్తించారు. వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్న అటవీ సిబ్బంది పులికి మత్తునిచ్చి బంధించారు.
స్థానికుల భయాందోళన..
మదుమలై పులి సంరక్షణ కేంద్రం సమీప ప్రాంతాల్లో కొంతకాలం నుంచి ఈ పులి సంచారం మొదలైంది. దానికి టీ-23గా నామకరణం చేశారు. మసినగుడి ప్రాంతంలో నలుగురు గ్రామస్థులతోపాటు 20కిపైగా జంతువులపై ఇది దాడిచేసి చంపింది. దీంతో స్థానికంగా భయాందోళనలు వ్యక్తమయ్యాయి. చివరగా గొర్రెలకాపరిపై దాడి చేసి చంపటం వల్ల గ్రామస్థులు ఆందోళనకు దిగారు. ఆ ప్రాంతంలో రోడ్లను దిగ్బంధించారు. గ్రామస్థుల ఆందోళనతో స్పందించిన అటవీశాఖ.. పులిని పట్టుకునేందుకు 20 సభ్యులతో 5ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. అవసరమైతే పులిని చంపాలని ఆదేశాలు జారీ చేసింది.