Bhima Koregaon case: భీమా-కోరెగావ్ కేసులో నిందితురాలు, న్యాయవాది, సామాజిక కార్యకర్త సుధా భరద్వాజ్ మూడేళ్ల తర్వాత జైలు నుంచి గురువారం విడుదలయ్యారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమె ముంబయిలోని జైలులో విచారణ ఖైదీగా ఉన్నారు.
కేంద్ర ప్రభుత్వాన్ని కూలదోయాలని కుట్ర పన్నారన్న ఆరోపణల కేసులో శిక్ష అనుభవిస్తున్న భరద్వాజ్‌కు 2021, డిసెంబర్ 1న బాంబే హైకోర్టు డీఫాల్ట్ బెయిల్ మంజూరు చేసింది. డిసెంబర్ 8న బెయిల్ ఆంక్షలు, విడుదల తేదీని నిర్ణయించాలని ప్రత్యేక ఎన్ఐఏ కోర్టును ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు విచారించిన ఎన్ఐఏ కోర్టు రూ.50వేల పూచీకత్తుతో విడుదల చేసేందుకు ఆదేశించింది.
కోర్టు ఆదేశాలు అందిన తర్వాత.. అన్ని లాంఛనాలు పూర్తి చేసుకుని గురువారం మధ్యాహ్నం బైకుల్లా మహిళా జైలు నుంచి బయటకు వచ్చారు సుధా భరద్వాజ్. ఆమె కోసం వేచి ఉన్న మీడియాతో మాట్లాడకుండానే కారులో వెళ్లిపోయారు.
ఇదీ కేసు..
2017, డిసెంబర్ 31న పుణె షానివార్వాడాలోని ఎల్గర్ పరిషద్ కాన్క్లేవ్ వద్ద చేసిన రెచ్చగొట్టే ప్రసంగాలతో.. ఆ తర్వాతి రోజును భీమా కోరాగావ్ వార్ మెమోరియల్ వద్ద హింసాత్మక ఘటనలు జరిగాయని పోలీసులు ఆరోపించారు. ఈ కేసులో భాగంగా సుధా భరద్వాజ్‌తో పాటు పలువురు హక్కుల నేతలపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో విచారణ చేపట్టిన పుణె పోలుసు.. వీరి వెనక మావోయిస్టులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగించారు. చట్ట వ్యతిరేక చర్యల నిరోధక చట్టం(యూఏపీఏ) కింద 2018, ఆగస్టులో భరద్వాజ్‌ను అరెస్ట్ చేసింది ఎన్ఐఏ. తమకు తెలియకుండా ముంబయిని వదిలి వెళ్లొద్దని, పాస్‌పోర్ట్ అప్పగించాలని, ఈ కేసుకు సంబంధించి మీడియాతో మాట్లాడొద్దని ఆంక్షలు విధించింది.