తమిళనాడులో రెండు ఏనుగులు తమ తల్లి కోసం వెతుక్కుంటూ అడవుల్లో తిరుగుతున్నాయి. తల్లి ఏనుగు ప్రాణాలు కోల్పోయిందన్న విషయం తెలియక... అవన్నీ దిక్కుతోచని స్థితిలో సంచరిస్తున్నాయి. పంట పొలాల చుట్టూ అక్రమంగా ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెకు తగిలి ఆ తల్లి ఏనుగు ప్రాణాలు కోల్పోయింది. ఇంకో రెండు ఏనుగులు సైతం ఆ ఘటనలో చనిపోయాయి. ఏనుగు పిల్లలు మాత్రం.. తమ తల్లి ఇంకా బతికే ఉందని రోజూ అవి వెళ్లిన చోటికి వెళ్లి వాటి అమ్మ కోసం వెతుకుతున్నాయి. అటవీ శాఖ అధికారులు.. ఆ ఏనుగు పిల్లలను మిగతా ఏనుగుల గుంపుతో కలపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో పాలకోడు ఫారెస్ట్ రిజర్వ్, మారండహళ్లి సమీపంలో ఐదు ఏనుగులు సంచరించేవి. అందులో 2 ఆడ, ఒక మాగ్నా(థర్డ్ జెండర్) ఏనుగుతో పాటు 2 పిల్ల ఏనుగులు ఉన్నాయి. ఇటీవల ఇవన్నీ కలిసి కొట్టాయ్ ప్రాంతంలోని వ్యవసాయ క్షేత్రంలోకి వెళ్లాయి. అక్కడ ఆహారం కోసం పంట పొలాల్లోకి ప్రవేశించాయి. అయితే ఆ పంట పొలం చుట్టూ విద్యుత్ కంచె వేశారు. ఆహారం కోసం పొలాల్లోకి వెళ్లిన ఏనుగులు వెళ్లిన ఏనుగులు పంటలను ధ్వంసం చేశాయి. ఆ క్రమంలో ఏనుగులు కంచెకు తాకడం వల్ల విద్యుదాఘాతంతో మొత్తం 3 ఏనుగులు (2 ఆడ, ఒక మాగ్నా ఏనుగు) మార్చి 8న మరణించాయి. వీటితో పాటు రెండు పిల్ల ఏనుగులు వచ్చాయి. కానీ అవి ప్రమాదం నుంచి తప్పించుకున్నాయి.
అయితే ఈ ఏనుగులతో పాటు వచ్చిన 2 ఏనుగులు తమ తల్లి చనిపోయాయని తెలియక అదే ప్రాంతంలో వాటి తల్లికోసం వెతుక్కుంటూ బిక్కుబిక్కుమంటూ తిరుగుతున్నాయి. తల్లి ఏనుగు కనిపిస్తుందేమో అనే ఆశతో పిల్ల ఏనుగులు అవి తిరిగిన ప్రాంతానికి వచ్చి చూసి వెళుతున్నాయి. ఈ రెండు ఏనుగులను సురక్షితంగా రక్షించి ఏనుగుల గుంపుతో ముదుమలై అభయారణ్యంలో విడిచిపెట్టాలని అటవీ శాఖకు మద్రాసు హైకోర్టు ఆదేశించింది.