అడవుల్లో తమకు నచ్చిన ఆహారాన్ని తింటూ.. సరదాగా ఉండాల్సిన ఏనుగులు జనావాసాల్లోకి ప్రవేశిస్తున్నాయి. అప్పుడప్పుడు రాత్రిళ్లు హల్చల్ చేస్తూ.. ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. అయితే థాయిలాండ్‌లోని హువా హిన్ ప్రాంతంలో ఓ ఇంటి గోడను పగులగొట్టి.. కిచెన్‌లోకి దూరింది ఓ ఏనుగు. ఇంకేముంది దొరికినంతవరకు తొండంతో అందుకుని కడుపునిండా ఆరగించి.. అక్కడి నుంచి జారుకుంది. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
సందు చూసి..
ఇంట్లోవారంతా మంచి నిద్రలో ఉండగా.. కిచెన్ నుంచి పెద్ద శబ్దం వచ్చింది. దీంతో నిద్రలేచిన రాట్చాదావన్.. భర్తను లేపింది. ఇద్దరూ కలిసి.. ఏమైందని చూసేసరికి ఏనుగు తల కనిపించింది. స్నాక్స్ ఉన్న ప్లాస్టిక్ సంచిని తొండంతో అందుకుని తింటుంది. ఈ సంఘటన చూసి దంపతులు మిన్నకుండిపోయారు.