Electricity Bill Scam Message :ప్రస్తుత కాలంలో సాంకేతికతతో కలిగే లాభాలతో పాటు అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. గత కొన్నాళ్లుగా సైబర్ నేరగాళ్లు కరెంట్ బిల్లుల పేరుతో స్కామ్‌లకు పాల్పడుతున్నారు. వారి బారిన పడితే మీ అకౌంట్లో ఉన్న డబ్బును దోచేస్తారు. విద్యావంతులు, నిరక్షరాస్యులు అనే తేడా లేకుండా అందరినీ వారు బురిడీ కొట్టిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు చేసే ఫోన్‌కాల్స్ పట్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒక వేళ వారి నుంచి ఫోన్ వస్తే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
అసలేంటి ఈ విద్యుత్ బిల్లుల స్కామ్?
ఇంటి కరెంట్ బిల్లు వెంటనే చెల్లించాలని.. లేదంటే సరఫరాను నిలిపివేస్తామనిసైబర్ నేరగాళ్లుమెసేజ్లు పంపుతుంటారు. అలాంటి వారి చేతిలో చాలా మంది మోసపోతున్నారు. దీనినే విద్యుత్ బిల్లుల స్కామ్‌గా పిలుస్తున్నారు. ఏయే మార్గాల ద్వారా ఇటువంటి స్కామ్‌లు జరుగుతున్నాయో తెలుసుకుందాం.
ఫోన్‌కాల్స్ ద్వారా..
ఈ మధ్య కాలంలో ఆన్లైన్ కరెంట్ బిల్లుల మోసాలు ఎక్కువయ్యాయి. సైబర్ మోసగాళ్లు కరెంట్ బిల్లులు చెల్లించాలని కొంతమందికి ఫోన్ చేస్తుంటారు. కరెంట్ ఆఫీస్ నుంచి కాల్చేస్తున్నామని చెబుతుంటారు. మీ విద్యుత్ బిల్లు బకాయి ఉందని వెంటనే చెల్లించాలి.. లేదంటే కనెక్షన్ కట్ చేస్తామని భయాందోళనలకు గురిచేస్తుంటారు. వెంటనే మీ ఫోన్‌కు పంపిన లింక్ ద్వారా చెల్లించండని మోసపూరితమైన వెబ్సైట్ లింక్‌లను పంపుతుంటారు. ఎట్టిపరిస్థితుల్లోనూ అలాంటి నకిలీ లింక్‌లపై క్లిక్ చేయొద్దు.
వాట్సాప్ మెసేజ్, ఎస్ఎంఎస్లతో..
సైబర్ నేరగాళ్ల ఆన్లైన్ మోసాలకు ఈ మధ్య వాట్సాప్, ఎస్ఎంఎస్లను వేదికగా చేసుకుంటున్నారు. వారు మన ఫోన్‌కు సందేశాలు పంపి అకౌంట్లో డబ్బులను దోచేస్తున్నారు. " ప్రియమైన వినియోగదారులారా.. మీరు గత నెల చెల్లించిన విద్యుత్ బిల్లు అప్డేట్ అవ్వలేదు. అందువల్ల బిల్లును వెంటనే చెల్లించండి. ఆలస్యమైతే మీ ఇంటికి విద్యుత్ సరఫరాను ఈరోజు రాత్రి 9.30 గంటలకు నిలిపివేస్తాం. మరిన్ని వివరాలకు వెంటనే సంబంధిత అధికారితో మాట్లాడటానికి 82603XXXX42 నంబర్‌కు సంప్రదించండి." ఇలాంటి మెసేజ్ మీకు వాట్సాప్‌లో వస్తే.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ నంబర్లకు ఫోన్ చేయొద్దు.