Electric bike catches fire: ఎలక్ట్రిక్ బైక్ ఛార్జింగ్ చేస్తుండగా మంటలు చెలరేగి వెలువడిన పొగతో ఊపిరాడక తండ్రీకూతురు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద సంఘటన తమిళనాడు, వెల్లూరు జిల్లాలోని చిన్న అల్లాపురమ్లో శనివారం రాత్రి జరిగింది. బాధితులు దురయ్ వర్మ(49), ఆయన కుమార్తె మోహన ప్రీతి(13).. మూత్రశాలలో విగతజీవులుగా కనిపించారని పోలీసులు తెలిపారు.
'ఈ-బైక్'లో మంటలు.. ఊపిరాడక తండ్రీకూతురు మృతి!
Electric bike catches fire: విద్యుత్తు వాహనాలు ఛార్జింగ్ చేస్తుండగా మంటలు అలుముకుంటున్న సంఘటనలు ఇటీవల పెరిగాయి. అలాంటి సంఘటనే తమిళనాడులోని వెల్లూరు జిల్లాలో శనివారం రాత్రి జరిగింది. ఈ-బైక్‌లో మంటలు చెలరేగి.. వెలువడిన పొగ కారణంగా ఊపిరాడక తండ్రీకూతురు మృతి చెందారు.
దురయ్వర్మ చిన్న అల్లాపురమ్లో వీడియోగ్రాఫర్. మూడు రోజుల క్రితం ఒకినావా ఓఖి ఈ-స్కూటర్‌ను కొనుగోలు చేశారు. ఇంటికి తీసుకెళ్లి శనివారం రాత్రి ఛార్జింగ్ పెట్టారు. ఈ క్రమంలోనే ద్విచక్రవాహనంలో మంటలు అంటుకున్నాయి. దాంతో వెలువడిన పొగ హాలు మొత్తం వ్యాపించింది. బైక్‌లో మంటలు రావటం, పొగ కారణంగా ఇంట్లోంచి బయటకు వచ్చే వీలులేకుండా పోయింది.
మంటలు, పొగను గమనించిన చుట్టుపక్కల వారు వెంటనే అగ్నిమాపక, పోలీసు సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు.. ఇంట్లోని టాయిలెట్ నుంచి మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం వెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.