Electoral Bonds Supreme Court Verdict Reserved :ఎన్నికల బాండ్ల పథకంతో క్విడ్-ప్రో-కో చట్టబద్ధం కారాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల బాండ్లు ముడుపులకు సాధనంగా మారకూడదని రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. ఎన్నికల బాండ్ల పథకంపై దాఖలైన కేసుల్లో తీర్పును రిజర్వు చేసింది. ఈ పథకం కింద ఏ పార్టీకి ఎన్ని విరాళాలొచ్చాయో వివరాలు సమర్పించాలని ఈసీని ఆదేశించింది.
Electoral Bonds SC Case :ఎన్నికల బాండ్ల పథకం చట్టబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై వరుసగా మూడో రోజు.. సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్లలో ఒకరైన స్వచ్ఛంద సంస్థ ఏడీఆర్ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్.. కేంద్రంలోనైనా, రాష్ట్రంలోనైనా ఎన్నికల బాండ్లన్నీ అధికార పార్టీకే వెళుతున్నాయని, ఇందుకు సాక్ష్యాలు ఉన్నాయని చెప్పారు. అయితే, నల్లధనాన్ని అరికట్టడం సహా స్వచ్ఛమైన డబ్బే పార్టీలకు విరాళాలుగా అందేలా చేయడానికి ఎన్నికల బాండ్ల పథకం తెచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు.
ఆరేళ్లలో బీజేపీకి రూ.10వేల కోట్ల విరాళాలు.. BRS, YCPలకు ఎన్ని వచ్చాయో తెలుసా?
'క్విడ్-ప్రో-క్వోను చట్టబద్ధం చేసే సాధనం కాకూడదు'
విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల ప్రక్రియలో నగదు పాత్రను గణనీయంగా తగ్గించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. అధికార కేంద్రాలకు, ఆ అధికారంతో లబ్ధి పొందే వారికి మధ్య జరిగే క్విడ్-ప్రో-కోను చట్టబద్ధత చేసే సాధనంగా ఎన్నికల బాండ్ల పథకం మారకూడదని పేర్కొంది. అధికారికంగా పార్టీలకు ముడుపులిచ్చే సాధనంగా ఇది ఉపయోగపడకుండా.. జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఎన్నికల బాండ్ల ద్వారా ఈ ఏడాది సెప్టెంబరు 30 వరకు రాజకీయ పార్టీలకు వచ్చిన విరాళాల వివరాలను సీల్డ్ కవర్లో సమర్పించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. పథకంలోని లోపాలను సరిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొంది.
'పార్టీలకు తెలిసినది.. ఓటరుకు తెలియొద్దా?'
తమకు విరాళాలు ఇచ్చేవారెవరో సంబంధిత పార్టీలకు తెలుసునని వాదనల సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు. అలాగైతే అంతా బహిర్గతం చేయొచ్చుగా అని మెహతాను ధర్మాసనం ప్రశ్నించింది. ఎవరికి ఎవరు విరాళాలిస్తున్నారో పార్టీలకు తెలిసినప్పుడు ఓటరుకు తెలియాల్సిన అవసరం లేదా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఎన్నికల ప్రక్రియలో నగదు పాత్రను తగ్గించాలన్న సీజేఐ... అధీకృత బ్యాంకింగ్ ఛానళ్లనే వినియోగించేలా ప్రోత్సహించాలన్నారు. గతంలో సంస్థలిచ్చే విరాళాలపై పరిమితులు ఉండేవన్న ఆయన.. దాన్ని ఎత్తివేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. షెల్ కంపెనీలు సృష్టికి అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే ఆ పరిమితిని ఎత్తివేశామని, కేంద్రం తరఫున తుషార్ మెహతా తెలిపారు. అనంతరం పిటిషన్లపై తీర్పును సుప్రీం ధర్మాసనం రిజర్వు చేసింది.
'బాండ్లతో ఎన్నికల రాజకీయంలోకి అవినీతి రహిత నగదు'
'ఆర్బీఐ నియమాలను అతిక్రమించి ఎన్నికల బాండ్లు'