పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(పీడీపీ) అధినేత్రి మెహబూబా ముఫ్తీ.. భాజపాపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నందుకు తన పార్టీని నిషేధించాలని కొందరు ప్రయత్నిస్తున్నట్టు మండిపడ్డారు. జమ్ముకశ్మీర్ స్థానిక ఎన్నికల ప్రచారానికి 'గుప్కార్ కూటమి' అభ్యర్థులకు అనుమతి ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి. ప్రచారానికి వెళ్లకుండా పోటీ ఎలా చేస్తారని ప్రశ్నించారు. కశ్మీర్లో ప్రజాస్వామ్యాన్ని భాజపా హరిస్తోందని ఆరోపించారు. 'భాజపా కార్యకర్తలే హిందువులా?' అని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై పోరాడే వారిపై యూఏపీఏ చట్టం కింద కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.
'భారత్-పాక్ చర్చలు జరపాలి'
కశ్మీర్ సమస్యకు పరిష్కారం.. ఎన్నికలు కాదన్న ముఫ్తీ.. భారత్- పాకిస్థాన్ మధ్య చర్చలు అవసరమని అభిప్రాయపడ్డారు. 'చైనాతో చర్చలు జరుపుతున్నాం. పాకిస్థాన్‌తో చర్చలు జరగకపోవటానికి కారణమేంటి? ఓ ముస్లిం దేశం అనే కదా పాక్‌తో చర్చలకు కేంద్రం సుముఖంగా లేదు?' అని ప్రశ్నించారు ముఫ్తీ.