కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు మరోమారు వాయిదా పడ్డాయి. కరోనా మహమ్మారి విజృంభణ కారణంగానే వాయిదా వేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అధ్యక్ష ఎన్నికలు నిర్వహించటం సరి కాదని సీడబ్ల్యూసీ సమావేశంలో నిర్ణయించినట్లు పేర్కొన్నాయి. గత సీడబ్ల్యూసీ సమావేశంలో, కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు జూన్ 23న చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపాయి.
ఎన్నికల తదుపరి షెడ్యూల్ను కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల అథారిటీ నిర్ణయిస్తుందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
జూన్ చివరి నాటికి అధ్యక్ష ఎన్నికలను పూర్తి చేయాలని గతంలో నిర్ణయించింది పార్టీ కేంద్ర ఎన్నికల అథారిటీ. ఈ విషయాన్ని సోమవారం జరిగిన సీడబ్ల్యూసీ సమావేశం ప్రారంభ ప్రసంగంలో వెల్లడించారు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ. " జనవరి 22న సమావేశమై.. జూన్ చివరి నాటికి అధ్యక్ష ఎన్నికల ప్రక్రియను ముగించాలని నిర్ణయించాం. ఎన్నికల అథారిటీ ఛైర్పర్సన్ మధుసుదన్ మిస్త్రీ జీ.. షెడ్యూల్ రూపొందించారు. ఎన్నికల ఫలితాలు, కొవిడ్-19పై చర్చల తర్వాత ఆ వివరాలను వేణుగోపాల్ మీకు తెలియజేస్తారు. " అని పేర్కొన్నారు.
అయితే.. కరోనా ఉద్ధృతి సమయంలో ఎన్నికలు నిర్వహించటం సరైన నిర్ణయం కాదని పార్టీ నేతలు సూచించినట్లు తెలుస్తోంది. పార్టీ నేతల సూచనల మేరకు మరోమారు వాయిదా వేసేందుకే సీడబ్ల్యూసీ మొగ్గు చూపినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
ఇదీ చూడండి:'టీకా విషయంలో చేతులు దులుపుకున్న కేంద్రం'