Prashant Kishor Bihar Politics: బిహార్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీతీశ్ కుమార్, ఉప ముఖ్యమంత్రిగా తేజస్వీ యాదవ్ ప్రమాణం చేశారు. అయితే బిహార్‌లో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ స్పందించారు. రాష్ట్రంలో గత 12-13 సంవత్సరాలుగా రాజకీయ అస్థిరత ఉందని పీకే అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఏదైనా ముఖ్యమంత్రిగా నీతీశ్ కుమార్ ఒక్కరే కొనసాగుతున్నారని అన్నారు. 2012-13 నుంచి ఇప్పటివరకు బిహార్ ప్రభుత్వ ఏర్పాటులో ఆరు ప్రయోగాలు జరిగాయని వెల్లడించారు. తాజాగా ఏర్పడిన జేడీయూ- ఆర్జేడీ సంకీర్ణ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ కీలక పాత్ర పోషిస్తారని అంచనా వేశారు. బిహార్ మినహా.. మిగతా రాష్ట్రాల్లో నీతీశ్‌కు ఆదరణ లేదని అభిప్రాయపడ్డారు ప్రశాంత్ కిశోర్.
నీతీశ్ కుమార్ సారథ్యంలోని జేడీయూ- భాజపా సంకీర్ణ కూటమిపై ప్రజల్లో సానుకూల అభిప్రాయం లేదు. తాజాగా జేడీయూ-ఆర్జేడీ సంకీర్ణ కూటమి ప్రభుత్వ అజెండా ఏమిటనేది తేలాల్సి ఉంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో నీతీశ్ కుమార్‌ను ప్రతిపక్షాల ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించే అవకాశం లేదు. భాజపాతో జత కట్టిన తరువాత నీతీశ్ ఒక్కరోజు కూడా ప్రశాంతంగా లేరు. తాజాగా జేడీయూ-ఆర్జేడీ-కాంగ్రెస్-వామపక్షాల వంటి ఏడు పార్టీలతో కూడిన సంకీర్ణ కూటమి కూడా ఇంతకుముందులా ప్రభావం చూపదు.
-ప్రశాంత్ కిశోర్, ఎన్నికల వ్యూహకర్త
2017 నుంచి 2022 వరకు నీతీశ్.. భాజపాతోనే ఉన్నారని అన్నారు ప్రశాంత్ కిశోర్. ప్రస్తుతం మహాఘట్‌బంధన్‌తో మరోసారి ప్రయోగాలు చేద్దామని ఆయన భావించి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఈసారైనా నీతీశ్ కుమార్.. బిహార్ ప్రజల ఆశయాలను నెరవేర్చుతారని ఆశిస్తున్నానని చెప్పారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం.. గత ప్రభుత్వం కంటే మెరుగ్గా పనిచేస్తుందో లేదో చూడాలని పీకే అన్నారు.