తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎన్నికల కాలం వస్తోంది.. గుజరాత్​, తెలంగాణ, కర్ణాటక సహా 11 రాష్ట్రాల్లో.. - 2022 ఇండియా ఎలక్షన్స్​

చలికాలం, ఎండాకాలం, వానాకాలాలతో పాటు ఈసారి మనదేశంలో ఎన్నికల కాలం కూడా వచ్చేస్తోంది. వచ్చే నెల హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలతో మొదలెడితే.. 2023 డిసెంబరులోపు 11 రాష్టాల్లో ఎన్నికలు జరగనున్నాయి.

elections
elections in india

By

Published : Oct 15, 2022, 7:24 AM IST

లికాలం, ఎండాకాలం, వానాకాలాలతో పాటు ఈసారి మనదేశంలో ఎన్నికల కాలం కూడా వస్తోంది. వచ్చే నెల హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలతో మొదలెడితే.. 2023 డిసెంబరు దాకా దేశంలో ఎన్నికలే ఎన్నికలు! హిమాచల్‌ ప్రదేశ్‌, గుజరాత్‌లతో మొదలయ్యే ఈ ఎన్నికల సీజన్‌ వచ్చే డిసెంబరులో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల దాకా కొనసాగుతుంది. ఈ ఏడాది కాలంలో 11 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ తర్వాత నాలుగైదు నెలల విరామంతో 2024లో లోక్‌సభకు సార్వత్రిక ఎన్నికలుంటాయి. షెడ్యూల్‌ ప్రకారం జరిగితే అప్పుడే ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీకి కూడా! ఇలా ఈ ఏడాదిన్నరంతా దాదాపు ఎన్నికల కోలాహలం ఉండబోతోంది.

హిమాచల్‌ ప్రదేశ్‌లో ఎన్నికల నగారా శుక్రవారం మోగింది. గుజరాత్‌ షెడ్యూల్‌ను మరికొద్దిరోజుల్లో ప్రకటిస్తారు. ఇప్పటికే ఈ రెండు రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి సాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా గత కొన్ని వారాలుగా ఈ రెండు రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించారు. అనేక అభివృద్ధి పథకాలకు, పనులకు శ్రీకారం చుట్టారు. తాజాగా.. గురువారం హిమాచల్‌ ప్రదేశ్‌లో వందేభారత్‌ రైలుకు పచ్చజెండా ఊపారు. గుజరాత్‌లోనైతే కేంద్ర మంత్రులు అనేక మంది మకాం వేస్తున్నారు. ఈసారి గుజరాత్‌లో భాజపాకు గట్టి పోటీ ఇవ్వాలనుకుంటున్న ఆప్‌ అధినేత, దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ కూడా పర్యటనల పరంపర కొనసాగిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కాకముందే అనేక స్థానాలకు తమ అభ్యర్థులను కూడా ప్రకటించేశారాయన! మోదీ స్వరాష్ట్రంలో వీలైతే జెండా పాతాలని, లేదంటే రెండోస్థానంలోనైనా నిలవాలని కేజ్రీవాల్‌ ప్రయత్నిస్తున్నారు.

.

ఆ ఐదూ కీలకం..
లోక్‌సభకు ముందు జరగబోతున్న ఈ పదకొండు అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు అత్యంత కీలకమైన రాష్ట్రాలున్నాయి. అవి.. గుజరాత్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, తెలంగాణ! వీటిలో రాజస్థాన్‌, తెలంగాణ తప్పిస్తే మిగిలిన మూడు రాష్ట్రాల్లో భాజపా అధికారంలో ఉంది. ఇక రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ అధికారంలో ఉంది. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న చత్తీస్‌గఢ్‌ కూడా 2023 డిసెంబరులో తెలంగాణతో పాటు ఎన్నికలకు వెళుతుంది. ప్రస్తుతం దేశంలో కాంగ్రెస్‌ సొంతంగా అధికారంలో ఉన్న రాష్ట్రాలు రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్‌లే. వాటిని ఆ పార్టీ నిలబెట్టుకుంటుందా లేదా అనేది ఆసక్తికరం.

  • అసెంబ్లీ గడువు తేదీ లోపు కొత్త సభ కొలువుదీరేలా నెల రెండు నెలల ముందే ఎన్నికలు జరగొచ్చు.
  • హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికలు నవంబరు 12న జరగనున్నాయి.

ఇదీ చదవండి:'ప్రధానికి మరింత సమయం దొరికింది'.. గుజరాత్ ఎన్నికలపై ప్రతిపక్షాల తీవ్ర విమర్శలు

హిమాచల్ ప్రదేశ్​ ఎన్నికల తేదీ ప్రకటన.. గుజరాత్​ విషయంలో ఈసీ ట్విస్ట్

ABOUT THE AUTHOR

...view details