యావత్ దేశం ఉత్కంఠగా ఎదురుచూసిన మినీ సార్వత్రిక పోరు ఫలితాలు ఆదివారం వెల్లడయ్యాయి. బంగాల్లో టీఎంసీకి భాజపా గట్టి పోటీ ఇస్తుందని భావించినప్పటికీ.. అలా జరగలేదు. సీఎం మమతా బెనర్జీ చరిష్మాతో తృణమూల్ హ్యాట్రిక్ కొట్టింది. తమిళనాడులో ఎంకే స్టాలిన్ సారథ్యంలోని డీఎంకే పదేళ్ల తర్వాత తిరిగి అధికారంలోకి వచ్చింది. కేరళలో వాపమక్ష కూటమి రెండోసారి అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించింది. 40ఏళ్ల అధికార మార్పిడి సంప్రదాయానికి తెరదించింది. అసోంలో భాజపా సారథ్యంలోని ఎన్డీఏ మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంది. పుదుచ్చేరిలో కాంగ్రెస్ కూటమిని గద్దె దించి ఎన్ఆర్ కాంగ్రెస్ సారథ్యంలోని ఎన్డీఏ అధికారం కైవసం చేసుకుంది.
అయితే 2016 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన పార్టీలే బంగాల్, కేరళ, అసోంలో తిరిగి అధికారంలోకి వచ్చాయి. గత ఎన్నికలు, ఈ ఎన్నికల్లో ఆ పార్టీల ఓటింగ్ శాతం ఎంత పెరిగింది? తమిళనాడులో డీఎంకేకు గత ఎన్నికల కంటే ఈసారి ఎంత శాతం ఓట్లు, ఎన్ని సీట్లు అధికంగా వచ్చాయో ఇంటరాక్టివ్ గ్రాఫిక్స్‌లో చూడండి.
బంగాల్..
బంగాల్లో 2011 నుంచి తన బలాన్ని అంతకంతకూ పెంచుకుంటూ వస్తోంది అధికార తృణమూల్ కాంగ్రెస్. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల్లో 42 ఎంపీ స్థానాలకు భాజపా 18 సీట్లు కైవసం చేసుకుని షాక్ ఇచ్చింది. ఆ పార్టీకి 40.7 శాతం ఓట్లు పోలయ్యాయి. తృణమూల్ కాంగ్రెస్‌కు 43.3 శాతం ఓట్లు వచ్చాయి. దీంతో పక్కా వ్యూహాలను రచించి 2021 అసెంబ్లీ పోరులో బరిలోకి దిగింది టీఎంసీ. దాదాపు 48 శాతం ఓట్లు కొల్లగొట్టింది. భాజపా ఓట్లను 2 శాతం తగ్గించింది.
తమిళనాడులో..
తమిళనాడులో అధికార అన్నాడీఎంకే హ్యాట్రిక్ ఆశలకు డీఎంకే గండి కొట్టింది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఓటింగ్ శాతాన్ని దాదాపు ఐదు శాతం పెంచుకుంది. అయితే 2019 పార్లమెంటు ఎన్నికల్లో ఘోర పరభావం చవిచూసిన అన్నాడీఎంకే ఓటింగ్ శాతాన్ని 18 నుంచి 33 శాతానికి పెంచుకుంది.