Election Materials Distribution in Telangana :హైదరాబాద్ పరిధిలోని 15 నియోజకవర్గాల్లో 4,119 పోలింగ్ కేంద్రాలు(Polling Stations) ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో 312 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా.. 36 వేల 852 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పోలింగ్‌కు సిద్ధమైంది. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్న పోలింగ్ కోసం రంగారెడ్డి పరిధిలోని 8 నియోజకవర్గాల్లో 3 వేల 453 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వికారాబాద్ పరిధిలోని 4 నియోజకవర్గాల్లో 1,133 పోలింగ్ కేంద్రాలు, మేడ్చల్ పరిధిలోని 5 నియోజకవర్గాల్లో 2 వేల 439 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
Polling Stations in Telangana 2023 : ఆయా నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన పంపిణీ కేంద్రాల్లో పోలింగ్ సిబ్బందికి అధికారులు ఎన్నికల సామాగ్రిని అందజేశారు. రంగారెడ్డి జిల్లాలో 15 వేల 212 మంది, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 12,510 మంది సిబ్బంది, వికారాబాద్ జిల్లాలో 5 వేల 449 మంది ఎన్నికల్లో విధుల్లో పాల్గొంటున్నారు. మొత్తం 347 మంది అభ్యర్థులు పోటీ పడుతున్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఓటర్లు తమ తుది తీర్పును ఈవీఎంల్లో నిక్షిప్తం చేసేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది.
తెలంగాణలో ఎన్నికలకు పోలింగ్ సామగ్రి పంపిణీ :వరంగల్ ఉమ్మడి జిల్లాలో 12 నియోజకవర్గాల నుంచి మొత్తం 215 మంది అభ్యర్ధుల బరిలో ఉండగా.. 29 లక్షల 56 వేల 439 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వరంగల్, హనుమకొండ జిల్లాలకు సంబంధించి.. పోలింగ్ సామగ్రి పంపిణీని ఎనుమాముల మార్కెట్‌లో నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లాలో.. సాంఘీక సంక్షేమ గురుకులు పాఠశాలలో పోలింగ్ సామగ్రి పంపిణీ(Election Materials Distribution) నిర్వహించారు. డోర్నకల్ నియోజకవర్గానికి సంబంధించి ఈవీఎంల పంపిణీని మరిపెడలోని.. సెయింట్ అగస్టీన్ పాఠశాలలో చేపట్టారు. జనగామ జిల్లాలో పోలింగ్ సామగ్రిని.. సాంఘిక సంక్షేమ పాఠశాలలో చేపట్టారు. ములుగు జిల్లాలోని ప్రభుత్వ కళాశాలలో పోలింగ్ సామగ్రి పంపిణీ చేపట్టారు. ములుగు నియోజకవర్గంలో మొత్తం 303 పోలింగ్ కేంద్రాల్లో 98 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. భూపాలపల్లి జిల్లాలోని అంబేడ్కర్ మైదానంలో పోలింగ్ సామగ్రిని అధికారులకు పంపిణీ చేశారు. భూపాలపల్లిలో మొత్తం పోలింగ్ కేంద్రాలు 317 కాగా.. ఇందులో 109 సమస్యాత్మమైనవిగా గుర్తించారు.
ఓటు వేసేందుకు సొంతూళ్ల బాట పట్టిన ఓటర్లు - కిటకిటలాడుతున్న బస్టాండ్ పరిసరాలు
Telangana Assembly Election Materials Distribution : ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 276 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 29 లక్షలకు పైగా ఓటర్లు తేల్చనున్నారు. నల్గొండ జిల్లాలో వెయ్యి 768, సూర్యాపేట జిల్లాలో వెయ్యి 201, యాదాద్రి భువనగిరి జిల్లాలో 566.. మొత్తంగా 3 వేల 535 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. నల్గొండ జిల్లాలో 336, సూర్యాపేట జిల్లాలో 176, యాదాద్రి భువనగిరి జిల్లాలో 294 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించిన ఎన్నికల అధికారులు.. ప్రలోభాల కట్టడికి తగిన చర్యలు చేపట్టారు. కేంద్ర, రాష్ట్ర బలగాలతో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.
Polling Arrangements in Telangana :ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని 14 నియోజకవర్గాల్లో పోలింగ్ సామగ్రి పంపిణీ దాదాపుగా పూర్తైంది. సుమారు 400 పైగా రూట్లలోని 3 వేల 875 పోలింగ్ కేంద్రాలకు ఆయా నియోజకవర్గాల పరిధిలోని పంపిణీ కేంద్రాల నుంచి సామాగ్రి తరలివెళ్లింది. సుమారు ఆరున్నర వేలకు పైగా బ్యాలెట్ యూనిట్లు, 4 వేల 800లకు పైగా కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్లను ఈ ఎన్నికల కోసం వినియోగిస్తున్నారు. మహబూబ్‌నగర్, దేవరకద్ర, జడ్చర్ల నియోజక వర్గ పంపిణీ కేంద్రాలను జిల్లా కలెక్టర్ రవి నాయక్ పరిశీలించారు.
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం సహా కొల్లాపూర్, అచ్చంపేటలోని పంపిణీ కేంద్రాలను నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ సందర్శించారు. గద్వాల, అలంపూర్ నియోజక వర్గ పంపిణీ కేంద్రాలను జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఎస్పీ రితిరాజ్ పరిశీలించారు. నారాయణ్‌పేట, మక్తల్ నియోజక వర్గ పంపిణీ కేంద్రాలను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తనిఖీ చేశారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సెక్టోరియల్ అధికారులు, పీవోలు, ఏపీవోలు, ఓపీవోలు పంపిణీ కేంద్రాలకు చేరుకున్నారు.