Election Fight in Greater Hyderabad : రాష్ట్ర రాజకీయంలో గ్రేటర్ హైదరాబాద్, పరిసర ప్రాంతాలు అత్యంత కీలకం. నాలుగో వంతుకు పైగా స్థానాలు ఇక్కడే ఉన్నాయి. ఇక్కడి గెలుపు ఓటములు రాష్ట్ర ఫలితాలను నిర్దేశిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. రోజులు గడుస్తున్న కొద్దీ, పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ రాజధాని, పరిసర ప్రాంతాల్లో రాజకీయం మరింత ఆసక్తికరంగా మారుతోంది. కొన్ని నియోజకవర్గాలు మినహాయిస్తే మెజార్టీ నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ(Telangana Election Fight) నెలకొంది. మరికొన్ని చోట్ల చతుర్ముఖ పోటీ కూడా ఉంది. విభిన్న ప్రాంతాలు, వివిధ వర్గాల ప్రజలు ఉన్న ఈ ప్రాంతంలో ఓటరు తీర్పు ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
పాతబస్తీలో మజ్లిస్‌కు బాగా పట్టుంది. చార్మినార్, యాకుత్ పురా, నాంపల్లి, బహదూర్‌పురాలో మజ్లిస్ అభ్యర్థులను మార్చింది. ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న ఏడు స్థానాల్లో మూడు చోట్ల ఆ పార్టీకి గట్టి పోటీ ఎదురవుతోంది. నాంపల్లిలో కాంగ్రెస్(Congress) అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ నుంచి పోటీ బాగా ఉండగా.. యాకుత్‌పురాలో ఎంబీటీ అభ్యర్థి అమ్జేద్ ఉల్లాఖాన్ బరిలో దిగడం సవాల్‌గా మారింది. మలక్‌పేటలో కాంగ్రెస్ అభ్యర్థి మజ్లిస్‌కు ధీటుగా ప్రజల్లోకి వెళ్తున్నారు.
తుది దశకు చేరుకున్న ఎన్నికల ప్రచారాలు - హాట్ హాట్‌గా ప్రధాన పార్టీల అగ్రనేతల ప్రసంగాలు
గోషామహల్‌లో బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య పోటీ : గోషామహల్‌లో బీజేపీ, బీఆర్‌ఎస్(BRS vs BJP) మధ్య పోటీ హోరాహోరీగా ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే రాజాసింగ్, బీఆర్‌ఎస్ అభ్యర్థి నందకిషోర్ వ్యాస్ మధ్య పోటీ ఉంది. అంబర్‌పేటలో బీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, బీజేపీ నుంచి మాజీ మంత్రి కృష్ణయాదవ్, కాంగ్రెస్ తరపున రోహిణ్ రెడ్డి పోటీలో ఉన్నారు. ఖైరతాబాద్‌లోనూ త్రిముఖ పోటీ నెలకొంది. బీఆర్‌ఎస్ అభ్యర్థి దానం నాగేందర్, కాంగ్రెస్ అభ్యర్థి విజయారెడ్డి మధ్య పోటీ తీవ్రంగా ఉంది. బీజేపీ తరపున బరిలో ఉన్న మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కూడా ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తున్నారు.
జూబ్లీహిల్స్‌లో చతుర్ముఖ పోటీ ఉంది. బీఆర్‌ఎస్ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, కాంగ్రెస్ నుంచి మాజీ క్రికెటర్ అజారుద్దీన్, మజ్లిస్ నుంచి ఫరాజుద్దీన్, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి పోటీలో ఉన్నారు. సనత్ నగర్‌లో త్రిముఖ పోరు నెలకొంది. బీఆర్‌ఎస్ నుంచి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరోమారు బరిలో దిగగా.. కాంగ్రెస్, బీజేపీ నుంచి కోట నీలిమ, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి పోటీలో ఉన్నారు. సికింద్రాబాద్‌లో ఉపసభాపతి పద్మారావు బీఆర్‌ఎస్ తరఫున పోటీలో ఉండగా.. కాంగ్రెస్ తరపున ఆదం సంతోష్ కుమార్, బీజేపీ అభ్యర్థిగా మేకల సారంగపాణి పోటీ చేస్తున్నారు. కంటోన్మెంట్‌లో బీఆర్‌ఎస్(BRS) అభ్యర్థి లాస్య నందిత, కాంగ్రెస్ అభ్యర్థి వెన్నెల, బీజేపీ అభ్యర్థి శ్రీగణేష్ పోటీలో ఉన్నారు.