బిహార్ ఫలితాలు కాంగ్రెస్‌ను కుంగదీశాయి. పార్టీ శ్రేణులను పూర్తిగా నైరాశ్యంలోకి నెట్టాయి. బిహార్ ప్రభావం.. కాంగ్రెస్‌పై అన్ని విధాలుగా ఉండనుంది. ఈ పరిణామాలు.. వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు ఎన్నికల్లోనూ పార్టీని ప్రభావితం చేయనున్నాయి. మహాకూటమిలో భాగంగా నిరాశ కలిగించే ఫలితాలు సాధించి.. కూటమికి అధికారం దూరం కావటానికి కారణమైందన్న వాదనల మధ్య.. డీఎంకే పొత్తు-స్థానాల కేటాయింపుపై పునరాలోచన చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ముందుగానే పావులు కదుపుతోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గట్టిపోటీ ఇవ్వాలని యోచిస్తోంది. సీట్ల పంపకం విషయంలో అప్పుడే చర్చలు మొదలుపెట్టింది.
రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ కేఎస్ అళగిరి, తమిళనాడు కాంగ్రెస్ పార్టీ బాధ్యుడు దినేశ్ గుండురావ్ సహా సీనియర్ నేతలు ద్రవిడ మున్నేట్ర కళగం(డీఎంకే) అధినేత ఎమ్కే స్టాలిన్‌తో భేటీ అయ్యారు.
ఇరు పార్టీల నేతలు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకంపై చర్చలు జరిపినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాల సమాచారం. అయితే పార్టీ వీటిని కొట్టిపారేసింది.
"అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల పంపకంపై ఈ రోజు ఎలాంటి చర్చ జరగలేదు. డీఎంకే నేతలను రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారానికి హాజరు కావాలని ఆహ్వానించేందుకే వచ్చాం. రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచార తేదీలు ఇంకా కొలిక్కిరాలేదు. మిత్రపక్షాలు ఎన్నికల ప్రచారం గురించి చర్చించాం. పార్టీకి పట్టున్న స్థానాలను గుర్తించే పనిలో ఉన్నాం."
- కేఎస్ అళగిరి, తమిళనాడు కాంగ్రెస్ చీఫ్