తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఐదు రాష్ట్రాల ఎన్నికలకు మోగనున్న నగారా

శుక్రవారం సాయంత్రం 4:30 గంటలకు ఎన్నికల సంఘం సమావేశంకానుంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించనుంది.

By

Published : Feb 26, 2021, 11:26 AM IST

Updated : Feb 26, 2021, 12:07 PM IST

election-commission-to-announce-dates-of-poll-bound-states-today
ఐదు రాష్ట్రాల్లో మోగనున్న ఎన్నికల నగారా

బంగాల్​, కేరళ‌ సహా నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి ఎన్నికల నగారా మోగనుంది. శుక్రవారం సాయంత్రం 4.30గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహించనుంది. కేరళ, బంగాల్‌, తమిళనాడు, అసోం, పుదుచ్చేరి ఎన్నికల తేదీలను ప్రకటించనుంది. ఇందుకోసం ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో పర్యటించి.. పరిస్థితులను పర్యవేక్షించింది.

  • బంగాల్​లో ఎన్నికల పరిణామాలు క్షణక్షణం ఉత్కంఠను తలపిస్తున్నాయి. బంగాల్‌ అసెంబ్లీలో 294 స్థానాలున్నాయి. గత ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ వరుసగా రెండోసారి జయకేతనం ఎగురవేసింది. ఈ ఏడాది ఎన్నికల్లోనూ విజయం సాధించి హాట్రిక్‌ కొట్టేయ్యాలని దీదీ భావిస్తున్నారు. అయితే ఎన్నికలకు కొద్ది నెలల ముందు నుంచి సువేందు అధికారి సహా కీలక నేతలు పార్టీని వీడటం తృణమూల్‌కు తలనొప్పిగా మారింది. మరోవైపు 2019 సార్వత్రిక ఎన్నికల్లో భారీగా పుంజుకున్న భాజపా.. శాసనసభ ఎన్నికల్లోనూ గెలుపును సొంతం చేసుకోవాలని వ్యూహాలు రచిస్తోంది.
  • 140 స్థానాలున్న కేరళ 14వ శాసనసభ గడువు జూన్‌ 1వ తేదీన ముగియనుంది. గత ఎన్నికల్లో వామపక్షాల నేతృత్వంలోని లెఫ్ట్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌.. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌పై భారీ మెజార్టీతో విజయం సాధించింది. అయితే ఈ సారి ఎలాగైనా మళ్లీ అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్‌ పట్టుదలగా ఉంది. అటు గత ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క సీటుకే పరిమితమైన భాజపా.. ఈ సారి ఓటర్లను ఆకర్షించేందుకు సరికొత్త వ్యూహాలను అమలుచేస్తోంది. ఇటీవలే మెట్రో మ్యాన్‌ శ్రీధర్‌ ఆ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.
  • తమిళనాడులో 15వ శాసనసభ గడువు మే 24తో ముగియనుంది. 234 సీట్లున్న రాష్ట్ర అసెంబ్లీలో ప్రస్తుతం అన్నాడీఎంకే అధికారంలో ఉంది. మాజీ సీఎం జయలలిత మరణం తర్వాత జైలుకెళ్లిన ఆమె నెచ్చెలి శశికళ ఇటీవలే విడదలయ్యారు. దీంతో అక్కడి రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. అటు స్టాలిన్‌ అధ్యక్షతన డీఎంకే కూడా అధికారాన్ని దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది.
  • ఈశాన్య రాష్ట్రం అసోంలోనూ త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ ప్రస్తుత శానసనభ గడువు ఏప్రిల్‌లో ముగియనుంది. తరుణ్‌ గొగొయ్‌ నేతృత్వంలో సుదీర్ఘంగా కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న అసోంలో గత ఎన్నికల్లో భారీ మార్పు చోటుచేసుకుంది. తొలిసారిగా ఆ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగిరింది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా అఖండ మెజార్టీతో విజయం సాధించింది. ఈ ఎన్నికల్లోనూ అదే ఉత్సాహంతో ఉంది. ఇదిలా ఉండగా.. ఈశాన్య రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు కీలక నేత అయిన తరుణ్‌ గొగొయ్‌ ఈ ఏడాది మరణించిన విషయం తెలిసిందే.
  • ఈ నాలుగు రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరికి కూడా త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. పుదుచ్చేరి శాసనసభ గడువు మే వరకు ఉంది. అయితే ఇటీవల అక్కడ నారాయణ స్వామి నేతృత్వంలోని కాంగ్రెస్‌ సర్కారు కుప్పకూలింది. ఎమ్మెల్యేల వరుస రాజీనామాలతో శాసనసభలో కాంగ్రెస్‌ బలం తగ్గింది. దీంతో బలనిరూపణలో విఫలమైన నారాయణస్వామి సీఎం పదవికి రాజీనామా చేశారు.
Last Updated : Feb 26, 2021, 12:07 PM IST

ABOUT THE AUTHOR

...view details