Election Commission Review on Andhra Pradesh Elections :ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ-2024, ఎన్నికల సన్నద్ధత కార్యకలాపాలపై విజయవాడ నోవాటెల్ హోటల్‌లో కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధుల బృందం సమీక్షా సమావేశం నిర్వహించింది. రెండు రోజుల సమావేశాల్లో భాగంగా తొలి రోజు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశమైంది. సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితీష్‌కుమార్ వ్యాస్, డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు ఆర్‌కే గుప్తా, హిర్దేశ్‌కుమార్, అజయ్‌బాదో తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఎక్కడెక్కడ ఘర్షణలు, అల్లర్లు, విధ్వంసాలు, హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి ? ఆయా కేసుల పరిస్థితి ఏంటి? తదితర అంశాలపై జిల్లాల వారీగా కేంద్ర ఎన్నికల అధికారులు ఆరా తీశారు.
Election Commission of India Visit to AP :అత్యంత సమస్యాత్మకమైన, సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాల్లో ఈసారి ఎలాంటి చర్యలు తీసుకున్నారని ఎన్నికల సంఘం ప్రతినిధుల బృందం అడిగి తెలుసుకున్నారు. గతంలో రీ-పోలింగ్ జరిగిన కేంద్రాల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఓటర్ల జాబితాపై తెలుగుదేశం, వైసీపీ, బీజేపీ తదితర పార్టీలు ఇచ్చిన ఫిర్యాదులపై ప్రశ్నించారు. వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించారా? ఏం తేల్చారు? వాటిలో వాస్తవమెంత? అనే అంశాలపై జిల్లాల వారీగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో వైసీపీ నాయకులు దాఖలుచేసిన ఫాం-7 దరఖాస్తులపై ఆరా తీశారు. దరఖాస్తుదారులపై ఏం చర్యలు తీసుకున్నారని ఆ జిల్లా కలెక్టర్‌ను ప్రశ్నించగా.. బాధ్యులందరిపై కేసులు నమోదుచేశామని ఆయన సమాధానమిచ్చారు.
కలెక్టర్లు, ఎస్పీలతో కేంద్ర ఎన్నికల సంఘం భేటీ - ఓటర్ల జాబితాలో అవకతవకలపై సమీక్ష!
Central Election Commission officials to visit AP :గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఏయే ప్రాంతాల్లో ఎంతెంత మద్యం పట్టుబడింది? ఎక్కడెక్కడ ఎక్కువగా డబ్బు స్వాధీనం చేసుకున్నారు? ఈ ఎన్నికల్లో వాటి కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే అంశాలపై సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ధర్మేంద్ర శర్మ ప్రధానంగా ఆరా తీశారు. సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు, తనిఖీ కేంద్రాలు ఇప్పటివరకూ ఎందుకు ఏర్పాటు చేయలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే పోలీసు, ఎక్సైజ్, అటవీ శాఖలు సంయుక్తంగా సరిహద్దుల్లో తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. తీరం వెంట గస్తీ పెంచాలన్నారు. మద్యం, డబ్బు, ఇతర అక్రమ రవాణాను కట్టడి చేసేందుకు సరిహద్దు జిల్లాలు, రాష్ట్రాల మధ్య సమన్వయం అవసరమని తెలిపారు. ఓటుహక్కుపై ప్రముఖులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లాస్థాయిలోనూ ప్రత్యేకంగా ఐటీ బృందాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
"ఐటీ ప్లాట్‌ఫాంలు ఏర్పాటు చేయడం ద్వారా ఎన్నికల ప్రక్రియ విధివిధానాలు వరుస క్రమంలో వివరించడానికి ఉపముక్తంగా ఉంటుంది. అలాగే తప్పులు, అభ్యంతరాలను సరిచేయడానికి ఐటీ బృందాలు ఉపయోగపడతాయి. మళ్లీ దస్త్రాలను సరిచూడాల్సిన పరిస్థితి ఉండదు. ఓటరు పేరు, నియోజకవర్గం అన్నీ అక్కడే సమగ్రంగా విశ్లేషించడానికి సులువుగా ఉంటుంది."- ధర్మేంద్ర శర్మ, సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్