కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ).. బంగాల్ సీఎం మమతా బెనర్జీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని శివసేన ఆరోపించింది. ఈసీ వంటి రాజ్యాంగబద్ధమైన సంస్థలు రాజకీయ ప్రయోజనాల కోసం పని చేయకూడదని విమర్శించింది. ఈ మేరకు శివసేన తన అధికార పత్రిక సామ్నాలో ఈసీ చర్యలను ఖండించింది.
ఈసీ.. ఆ నమ్మకాన్ని వమ్ము చేసింది: శివసేన
బంగాల్ శాసనసభ ఎన్నికల వేళ సీఎం మమతా బెనర్జీ విషయంలో ఈసీ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించింది శివసేన. ఇటీవల 24 గంటలపాటు మమత ప్రచారంపై ఈసీ నిషేధం విధించిన నేపథ్యంలో ఈ మేరకు శివసేన తన అధికార పత్రికలో సామ్నాలో ఈసీ చర్యలపై విమర్శలు గుప్పించింది.
'బంగాల్ ఎన్నికల్లో సీఎం మమతా బెనర్జీపై ఈసీ కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. కాబట్టి మేం ఈసీకి చేతులు జోడించి ఓ విషయాన్ని అడగదలచుకున్నాం. వారు ఒక భాజపాను మాత్రమే కాకుండా అందరినీ సమానంగా చూడాలి. తారతమ్యాలు ఉండకూడదు. చట్టం ముందు అందరూ సమానమే అనే విశ్వాసాన్ని బంగాల్‌లో ఈసీ వమ్ము చేసింది. బంగాల్ విప్లవకారుల భూమి అని మరచిపోయినట్లుంది. ఏదేమైనప్పటికి, ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా మమతా బెనర్జీ ఒంటరిగా నిర్వహించిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది. బంగాల్‌లో కేంద్ర బలగాలను మోహరించినపుడు అల్లర్లను అదుపు చేయాల్సింది పోయి.. కాల్పులకు తెగబడటం ఆందోళనకర పరిణామం. ఆ హింసకు కేంద్రమే బాధ్యత వహించాలి' అని ఈసీపై విమర్శలు గుప్పించింది సామ్నా.
ఇదీ చూడండి:'బంగాల్‌లో కరోనా వ్యాప్తికి భాజపా కుట్ర'