దేశంలో మరో భారీ ఎన్నికల సమరానికి తెరలేచింది. పశ్చిమ్ బంగా, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి శాసన సభ ఎన్నికల షెడ్యూల్‌ను శుక్రవారం ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ).
మార్చి 27 నుంచి ఎన్నికలు జరగనున్నాయి. నేటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి రానున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) సునీల్ అరోడా స్పష్టం చేశారు. మే 2న అన్ని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంత ఎన్నికల ఫలితాలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
బంగాల్‌లో 8 విడతల్లో పోలింగ్ జరగనుంది. అసోంలో 3 దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి.
పశ్చిమ్ బంగా:
బంగాల్‌లో మొత్తం 8 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలు 294.
బంగాల్‌లో 8 దశల్లో పోలింగ్ అసోం:
ఈశాన్య రాష్ట్రం అసోంలో 126 స్థానాలకు 3 దశల్లో పోలింగ్ జరగనుంది.
తమిళనాడు:
రాష్ట్రంలోని 234 స్థానాలకు ఒకే దశలో ఏప్రిల్ 6న పోలింగ్ జరగనుంది.
తమిళనాడు ఎన్నికల షెడ్యూల్ కేరళ:
కేరళలో 140 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏప్రిల్ 6న ఒకే దశలో పోలింగ్ నిర్వహించనున్నారు.
పుదుచ్చేరి:
ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో ఏప్రిల్ 6న ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనుంది ఈసీ. ఇక్కడ 30 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
పుదుచ్చేరి ఎన్నికల తేదీలు మొత్తం 824 సీట్లకు ఈసారి ఎన్నికలు జరుగుతుండగా.. 2.7లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు సునీల్ అరోడా వెల్లడించారు. 18.68 కోట్ల మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనున్నట్టు స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి లోక్‌సభ, తెలంగాణలోని నాగార్జున సాగర్ శాసనసభ ఉప ఎన్నికలు సహా ఖాళీగా ఉన్న ఇతర స్థానాల్లో షెడ్యూల్‌ను ఈసీ ప్రత్యేకంగా ప్రకటించనుంది.
నిబంధనలు.. భద్రత..
పోలింగ్ జరిగే ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయనున్నట్టు స్పష్టం చేశారు అరోడా. సున్నితమైన ప్రాంతాలను ముందుగానే గుర్తించి.. అదనపు బలగాలను మోహరించనున్నట్టు తెలిపారు.
వ్యాక్సిన్ రాకతో ఎన్నికల నిర్వహణ ప్రక్రియ కొంత సులభమైనట్టు పేర్కొన్నారు సునీల్ అరోడా. తాజా పోలింగ్‌కు ముందే ఎన్నికల అధికారులందరికీ వ్యాక్సిన్లు పంపిణీ చేయనున్నట్టు ప్రకటించారు. పోలింగ్ కేంద్రాల్లో శానిటైజర్లు, మాస్కులు వంటి ఏర్పాట్లు తప్పనిసరి అని స్పష్టం చేశారు.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో.. డోర్-టు-డోర్ ప్రచారాలను నియంత్రిస్తున్నట్టు అరోడా వెల్లడించారు. అభ్యర్థితో సహా ఐదుగురికి మాత్రమే అనుమతినిస్తున్నట్టు పేర్కొన్నారు. రోడ్ షోలను ఏర్పాటు చేసుకోవచ్చని స్పష్టం చేశారు.
చివరి ఎన్నికలు..
పోలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేస్తూ.. బిహార్ ఎన్నికలను ప్రస్తావించారు అరోడా. కరోనా సంక్షోభంలోనూ ఎన్నికలను విజయవంతంగా జరిపినట్టు పేర్కొన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కరోనా యోధులకు నివాళులర్పించారు.
ప్రధాన ఎన్నికల అధికారిగా.. ఏప్రిల్ 13తో సునీల్ అరోడా పదవీకాలం ముగియనుంది. దేశంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కోసం.. తనకు ఇదే చివరి మీడియా సమావేశమన్నారు. ఈ నేపథ్యంలో మీడియాకు ధన్యవాదాలు తెలిపారు అరోడా.