Election Campaign Ends in Chhattisgarh :సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మంగళవారం రెండు రాష్ట్రాల్లో పోలింగ్ జరగనుంది. మిజోరంలోని మొత్తం 40 అసెంబ్లీ స్థానాలతోపాటు ఛత్తీస్‌గఢ్‌లోని 20 స్థానాలకు మొదట విడతలో నవంబర్ 7న పోలింగ్ జరగనుంది. మంగళవారం పోలింగ్ జరగనున్న ప్రాంతాల్లో ప్రచారానికి ఆదివారంతో తెరపడింది. ఈ రెండు రాష్ట్రాల్లో కలిపి మొత్తంగా 60 శాసనసభ స్థానాల్లో పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Mizoram Assembly Election 2023 :మిజోరంలో 40 అసెంబ్లీ స్థానాలుండగా.. 8.57లక్షల మంది ఓటర్లున్నారు. మొత్తం 174 మంది బరిలో నిలబడ్డారు. అధికార మిజో నేషనల్ ఫ్రంట్, జోరం పీపుల్స్ మూమెంట్, కాంగ్రెస్ పూర్తిస్థాయిలో అభ్యర్థులను రంగంలో దించాయి. బీజేపీ 23 మందిని, ఆమ్‌ఆద్మీపార్టీ నలుగురిని పోటీలో నిలిపాయి. మరో 27 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఐదేళ్ల కిందట కోల్పోయిన అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తోన్న కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వంటి నేతలతో అక్కడ ప్రచారం నిర్వహించింది. తాజాగా మిజో ఓటర్లను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా అద్భుత మిజోరంకు బీజేపీ కట్టుబడి ఉందని.. ఇందుకు రాష్ట్ర ప్రజల మద్దతు లభిస్తుందని ఆశిస్తున్నానని అన్నారు. అక్టోబర్ 30న మిజోరంలో ప్రధాని పర్యటించాల్సి ఉన్నప్పటికీ ఆకస్మికంగా అది రద్దయ్యింది.
Mizoram Election 2023 : మిజోరంలో పోలింగ్ విధుల్లో ఉన్న ప్రభుత్వ అధికారులకు పోస్టల్ బ్యాలెట్‌తోపాటు వయోవృద్ధులు, దివ్యాంగులకు ఇంటినుంచే ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఇలా 2059 మంది వృద్ధులు, దివ్యాంగులు, 8526 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల అధికారులు వెల్లడించారు. మొత్తంగా 10,585 మంది ఈ వెసులుబాటు పొందారని తెలిపారు.