Election Business Online Campaign Effect :మారుతున్న కాలంతోపాటు ఎన్నికల ప్రచారం సైతం కొత్త పుంతలు తొక్కుతోంది. బహిరంగ సభలు, ర్యాలీలకు తోడు.. సామాజిక మాధ్యమాలు ఎన్నికలపై గట్టి ప్రభావం చూపుతున్నాయి. యువత ఎక్కువ సమయం ఫోన్లలోనే సమయం కేటాయిస్తున్నారు కాబట్టి.. వారిని ప్రసన్నం చేసుకునేందుకు.. పార్టీలు కూడా సామాజిక మాధ్యమాలను ప్రచారానికి వేదికగా చేసుకుంటున్నాయి. ఎన్నికల ప్రచారం డిజిటల్ బాటపట్టడంతో పార్టీల జెండాలు, టోపీలు, టీషర్టులు, కీచైన్‌లు, కండువాలు, బెలూన్లు వంటివాటిని అమ్మే వ్యాపారాలకు గిరాకీ బాగా తగ్గిపోయింది.
'సగం కూడా అమ్మలేకపోతున్నాం..'
Social Media Campaign effect Election Business :మధ్యప్రదేశ్‌లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. సాధారణంగా ఎన్నికల సమయంలో తమ వ్యాపారాలు ఉచ్ఛస్థితిలో ఉంటాయనీ.. కానీ ఈ సారి అది చాలా వరకు తగ్గిపోయిందని ఎన్నికల జెండాలు ఇతరత్రాలను అమ్మే వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంతో పోలిస్తే ఇప్పుడు సగం కూడా అమ్మలేకపోతున్నామని తెలిపారు.
"సోషల్ మీడియా ప్రభావంతో మా వ్యాపారంలో దాదాపు 80 శాతం తగ్గిపోయింది. ఒకప్పుడు రూ.100 వచ్చే వ్యాపారంలో ఇప్పుడు కేవలం రూ. 20 మాత్రమే వస్తున్నాయి. ఇలాంటి పీక్ సీజన్‌లో మాట్లాడటానికి కూడా సమయం ఉండేది కాదు. కానీ ఇప్పుడు గిరాకీ లేక మౌనంగా కూర్చున్నాము. సోషల్ మీడియా ఇక్కడ చాలా ప్రభావం చూపింది."
-అజయ్ అగర్వాల్, వ్యాపారి"ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వార్తలు చాలా త్వరగా ప్రజలకు చేరుతున్నాయి. మొబైల్స్, ఎలక్ట్రానిక్ మీడియా కారణంగా మా వ్యాపారంపై పెద్ద ప్రభావం పడింది."
-గులాబ్‌రావ్ పవార్, వ్యాపారి