Uttarakhand Assembly election: ఉత్తరాఖండ్‌లో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం కోసం అధికార భాజపా, ప్రతిపక్ష కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం 70 నియోజకవర్గాలు ఉండగా.. రెండు పార్టీలూ ఇప్పటికే మెజార్టీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కూడా ఇక్కడ సత్తాచాటేందుకు ఉవ్విళ్లూరుతోంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని స్థానాల్లోనూ పోటీ హోరాహోరీగా సాగే అవకాశాలున్నప్పటికీ.. ప్రధానంగా ఐదు నియోజకవర్గాలు ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి.
ఖటీమా: సీఎం ధామీ గట్టెక్కేనా?
Khatima Uttarakhand assembly seat: ఇప్పటివరకూ ఉత్తరాఖండ్‌లో సిట్టింగ్ ముఖ్యమంత్రులెవరూ తర్వాతి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించలేదు. 2002 ఎన్నికల్లో నిత్యానంద్ స్వామి, 2012లో బి.సి.ఖండూరి, 2017లో హరీశ్ రావత్‌లకు పరాజయాలు ఎదురయ్యాయి. 2007లో అప్పటి సిట్టింగ్ సీఎం ఎన్.డి.తివారీ ఎన్నికల బరిలో దిగలేదు. ఈ దఫా ఎలాగైనా విజయం సాధించి సీఎంల పరాజయ పరంపరకు తెరదించాలని ప్రస్తుత ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామి కృతనిశ్చయంతో ఉన్నారు. 2012, 2017 ఎన్నికల్లో తనకు విజయాన్నందించిన ఖటీమా స్థానం నుంచే ఆయన ఇప్పుడు బరిలో ఉన్నారు. అయితే రాష్ట్ర కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు భువన్‌చంద్ర కాప్రీ రూపంలో గట్టి ప్రత్యర్థి ఆయనకు సవాలు విసురుతున్నారు. గత ఎన్నికల్లో కాప్రీని ఓడించిన అనుభవం ధామికి మానసికంగా పైచేయినిచ్చేదే. అయితే- ఇక్కడ సిక్కులు, రైతులు అధిక సంఖ్యలో ఉన్న నేపథ్యంలో.. సాగుచట్టాలపై సుదీర్ఘంగా జరిగిన పోరు ఆయనకు ప్రతికూలంగా పనిచేసే అవకాశాలు లేకపోలేదు. ఆప్ తరఫున ఆ పార్టీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు ఎస్.ఎస్.కలేర్ కూడా ఇక్కడ బరిలో ఉండటంతో పోరు ఉత్కంఠగా సాగుతుందని అంచనాలున్నాయి.
హరిద్వార్ (నగర): మదన్ కౌశిక్‌కు ఎదురుందా?
Madan kaushik BJP:ప్రస్తుతం రాష్ట్ర భాజపా అధ్యక్షుడిగా ఉన్న మదన్ కౌశిక్‌కు కంచుకోట ఇది. గత నాలుగుసార్లూ ఇక్కడ ఆయనదే విజయం. ఈ దఫా కాంగ్రెస్ అభ్యర్థి సత్పాల్ బ్రహ్మచారి నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశముంది. హరిద్వార్ నగరపాలిక ఛైర్మన్‌గా బ్రహ్మచారి బాగా పనిచేశారని పేరుంది. ఈసారి ఓటర్లు మార్పు వైపు మొగ్గుచూపనున్నట్లు వెలువడుతున్న అంచనాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
చక్‌రాతా: జుబిన్ ప్రచారం ఫలిస్తుందా?
అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న ప్రీతంసింగ్ బరిలో నిలిచిన నియోజకవర్గం. గత నాలుగు పర్యాయాలూ ఈ స్థానంలో ఆయనదే జయభేరి. ఈసారి ఆయన్ను ఎలాగైనా ఓడించాలన్న వ్యూహంతో బాలీవుడ్ గాయకుడు జుబిన్ నౌట్యాల్ తండ్రి రాంశరణ్ నౌట్యాల్‌ను భాజపా పోటీకి దించింది. తండ్రికి మద్దతుగా జుబిన్ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. యువతలో ఆయనకున్న ఆదరణ రాంశరణ్ విజయానికి బాటలు పరుస్తుందని కమలదళం విశ్వాసంతో ఉంది.