చిన్నప్పటి నుంచి తనతో కలిసి పెరిగిన తమ్ముడు ఇక లేడు అని తెలిసేసరికి ఆ అన్న తట్టుకోలేకపోయారు. కాసేపట్లో తన రక్త సంబంధం మట్టిలో కలిసిపోతుందనే బరువైన నిజాన్ని ఆ అన్న గుండె మోయలేకపోయింది. అందుకే తమ్ముడి మరణవార్తను తట్టుకోలేని ఆ సోదరుడి హృదయం.. ఒక్కసారిగా ఆగిపోయింది. ఒక్కరోజులోనే గుండెపోటుతో అన్నదమ్ములిద్దరూ మృతి చెందడం వల్ల.. వారి కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. రాజస్థాన్‌లోని సీకర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.
చావులోనూ వీడని 'బంధం'.. తమ్ముడి మృతదేహాన్ని చూసి అన్నకు గుండెపోటు
ఆ అన్నదమ్ములకు తల్లి పంచిన పేగు బంధం.. వారి మధ్య ఆప్యాయతను 65 ఏళ్ల పాటు పదిలంగా ఉంచింది. పెళ్లిళ్లు చేసుకుని వేర్వేరు కాపురాలు పెట్టినా.. ఏనాడూ పొరపొచ్చాలు రాకుండా బతికారు! అందుకే మరణం కూడా వారిని విడదీయలేకపోయింది. తమ్ముడి అకాల మరణాన్ని తట్టుకోలేకపోయిన అన్న సైతం.. గుండెపోటుతో మరణించారు.
వివరాల్లోకి వెళ్తే..
జిల్లాలోని రామ్‌గఢ్ షెకావతి పట్టణంలో పాత బస్టాండ్ సమీపంలోని ఖాజీ నియాజ్ అహ్మద్ (65) నివాసముంటున్నారు. శనివారం సాయంత్రం ఆయనకు టీ ఇచ్చేందుకు.. కుటుంబసభ్యులు నిద్రలేపారు. కానీ ఆయన లేవలేదు. వెంటనే ఆయనను కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. గుండెపోటుతో నియాజ్ అహ్మద్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు.
అదే పట్టణంలో ఉంటున్న ఖాజీ నియాజ్ అన్నయ్య జమీల్ అహ్మద్ (70) తన తమ్ముడు మృతి చెందిన విషయాన్ని సాయంత్రం 7 గంటల సమయంలో తెలుసుకున్నారు. తమ్ముడి మృతదేహాన్ని చూసి జమీల్ అహ్మద్ తట్టుకోలేకపోయారు. వెక్కి వెక్కి ఏడ్చారు. కాసేపటికే అతడు కూడా గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆయనను తన ఇంటికి తరలించారు కుటుంబసభ్యులు. అప్పటికే ఆయన మరణించారు. అన్నదమ్ములిద్దరూ ఒకేరోజు హఠాన్మరణం చెందడం వల్ల పట్టణంలో విషాదఛాయలు అలుముకున్నాయి.