అయోధ్య గుడిలో ఇచ్చే ప్రసాదం ఇదేనట- తింటే ఆరోగ్యానికి మేలు! Elaichi Dana Prasad In Ayodhya :అయోధ్యలో నూతన రామమందిర ప్రారంభోత్సవం మరికొద్ది రోజుల్లో జరగనుంది. రామయ్య సందర్శనకు వచ్చే భక్తులకు ప్రసాదంగా 'ఇలాచి దానా'ను అందించాలని నిర్ణయించింది శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్. పంచదార, యాలకులతో తయారుచేసే ఇలాచి దానాను ఇప్పటికే దేశంలోని కొన్ని ఆలయాల్లో భక్తులకు అందిస్తున్నారు. ఈ ప్రసాదం తయారీ బాధ్యతను రామ్‌విలాస్ అండ్ సన్స్ అనే దుకాణానికి అప్పగించింది అయోధ్య ట్రస్ట్.
ప్ర: మీరు ఎంత మొత్తంలో ఇలాచి దానాను సిద్ధం చేస్తున్నారు?
జ: మేము రోజూ ప్రసాదం తయారుచేస్తాం. అలా కాకుండా ఆలయ ట్రస్ట్ నుంచి ఏవైనా సూచనలు వస్తే అందుకు అనుగుణంగా పని చేస్తాం.
-మిథిలేశ్ కుమార్, రామ్ విలాస్ అండ్ సన్స్ యజమాని
ఇలాచి దానా తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట.
'ఇలాచి దానాలో పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి. ఇవి ఉదర సంబంధిత సమస్యలను పరిష్కరిస్తాయి. ఉత్తరప్రదేశ్ నలుమూలల నుంచి భక్తులు మా దగ్గర ఇలాచి దానా ప్రసాదాన్ని కొనడానికి వస్తారు. పూర్వాంచల్ ప్రాంతం నుంచి వచ్చి కూడా ప్రసాదం కొనుగోలు చేస్తారు.' అని రామ్ విలాస్ అండ్ సన్స్ షాపు యజమాని బోల్ చంద్ర గుప్తా తెలిపారు.
జనవరి 22లోపు 5 లక్షల ఇలాచి దానా ప్రసాదం ప్యాకెట్లను ఆలయ ట్రస్ట్‌కు అందించేందుకు రామ్ విలాస్ అండ్ సన్స్ సిబ్బంది కృషి చేస్తున్నారు.
ఇలాచి దానా ప్రసాదం ప్యాకెట్లు ప్రారంభోత్సవ కార్యక్రమ వివరాలు ఇలా!
Ram Mandir Opening Ceremony : అయోధ్య రామాలయ గర్భగుడిలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు 2024 జనవరి 16వ తేదీ నుంచి మొదలుకానున్నాయి. 17వ తేదీన 51 అంగుళాల బాల రాముడి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకువస్తారు. జనవరి 20న సరయూ నదీజలాలతో రామమందిరాన్ని శుద్ధి చేస్తారు. అదే రోజు వాస్తు పూజలు నిర్వహిస్తారు. 21న బాల రాముడి విగ్రహం సంప్రోక్షణ ఉంటుంది. 22న ఉదయం పూజల అనంతరం మృగశిర నక్షత్రంలో మధ్యాహ్న సమయంలో బాల రాముడి విగ్రహాన్ని శాశ్వత ప్రతిష్ఠ చేయనున్నారు.