Eknath shinde oath ceremony: శివసేన రెబల్ నేత ఏక్నాథ్ శిందే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ సమక్షంలో ఆయన సీఎంగా ప్రమాణం చేశారు. భాజపా నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్.. ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
అంతకుముందు భారీ ట్విస్టులు, నాటకీయ పరిణామాల మధ్య ముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్నారు ఏక్నాథ్ శిందే. మహా వికాస్ అఘాడీ సర్కారుపై తిరుగుబాటు చేసి.. ప్రభుత్వం కుప్పకూలేలా చేసిన ఆయన.. భాజపాతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొచ్చారు. అనూహ్యంగా శిందేను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు ఫడణవీస్ సంచలన ప్రకటన చేశారు. తాను ప్రభుత్వంలో భాగం కాబోనని తొలుత ఫడణవీస్ ప్రకటించగా.. భాజపా హైకమాండ్ కోరిక మేరకు ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. మహారాష్ట్ర ప్రజలకు సేవ చేసేందుకు ఫడణవీస్.. డిప్యూటీ సీఎం పదవిని స్వీకరించేందుకు ఒప్పుకున్నారని కేంద్ర మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు.