మహారాష్ట్రలోని ఏక్‌నాథ్ శిందే ప్రభుత్వం మరో 15-20 రోజుల్లో కూలిపోతుందని శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వానికి డెత్ వారెంట్ జారీ అయిందన్నారు. మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే శివసేన పార్టీలో తిరుగుబాటు చేసిన 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేయాలని సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌పై మాట్లాడిన సంజయ్ రౌత్ తమకు కచ్చితంగా న్యాయం జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల కోసమే ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. గతేడాది జూన్‌లో ఏక్‌నాథ్ శిందే నేతృత్వంలోని 39 మంది ఎమ్మెల్యేలు శివసేన నాయకత్వంపై తిరుగుబాటు చేసి పార్టీని చీల్చారు. దీంతో ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో కూడిన మహావికాస్ ఆఘాడీ ప్రభుత్వం కూలిపోయి భాజపా మద్దతుతో ఏక్‌నాథ్ శిందే ముఖ‌్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడిన ఆయన అనర్హత వేటు సహా పెండింగ్‌లో ఉన్న అనేక పిటిషన్లను ప్రస్తావించారు.
"శిందే ప్రభుత్వానికి ఇప్పటికే డెత్ వారెంట్ జారీ అయింది. కేవలం తేదీని మాత్రమే ప్రకటించాల్సి ఉంది. దానిపై ఎవరు సంతకం చేస్తారనేది కోర్టు తీర్పు తర్వాతే తెలుస్తుంది. ఈ సర్కార్ కూలిపోతుందని నేను ఫిబ్రవరిలోనే చెప్పాను. అయితే న్యాయస్థానం తీర్పులో జాప్యం కారణంగా అది జరగలేదు. మరో 15-20 రోజుల్లో ఈ ప్రభుత్వం కచ్చితంగా కూలిపోతుంది"