మహారాష్ట్ర, పుణె జిల్లాలో విషాద ఘటన జరిగింది. భాట్ఘర్ జలాశయం బ్యాక్ వాటర్‌లో ఈతకు వెళ్లి ఐదుగురు మహిళలు నీట మునిగి చనిపోయారు. "ఐదుగురి మృతదేహాలను వెలికి తీశాం. వారి వయసు 19 నుంచి 23 మధ్యలో ఉంటుంది" అని పుణె రూరల్ పోలీసులు తెలిపారు.
భోర్ తహసీల్, నరేగావ్ గ్రామంలోని తమ బంధువుల ఇంట్లో జరిగే శుభకార్యానికి ఐదుగురు యువతులు హాజరయ్యారు. అన్ని కార్యక్రమాలు ముగిసిన తర్వాత.. గురువారం సాయంత్రం డ్యామ్‌లోని బ్యాక్ వాటర్‌లో ఈత కోసం వెళ్లారు. నీటి లోతు ఎక్కువగా ఉండటం వల్ల మునిగిపోయారు.
నలుగురు పదో తరగతి విద్యార్థులు:పుణె జిల్లాలోనే జరిగిన మరో ఘటనలో నలుగురు విద్యార్థులు నీట మునిగారు. క్రిష్ణమూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలోని సహ్యాద్రి ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు నలుగురు.. ఖేడ్ తహసీల్‌లోని చాస్కమాన్ డ్యామ్‌లో ఈత కోసం వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగారు. మృతుల్లో ఇద్దరు బాలురు, ఇద్దరు బాలికలు.. రితీన్ డీడీ, నవ్య భోస్లే, పరిక్షత్ అగర్వాల్, తనిష్క దేశాయ్లుగా గుర్తించారు. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి జలాశయం చూసేందుకు వెళ్లారని, నీటిలో ఈతకు వెళ్లగా కొందరు విద్యార్థులు నీట మునిగారని పోలీసులు తెలిపారు. అందులో పలువురిని ఉపాధ్యాయులు కాపాడగా.. నలుగురు మృతి చెందినట్లు చెప్పారు.
ఇదీ చూడండి:అతిపెద్ద కుటుంబం.. ఒకటిన్నర ఎకరంలో ఇల్లు.. 62 మందికి ఒకే కిచెన్!