Eggs in the size of grapes: కోడిగుడ్డు పక్కన ఏవో ఉన్నాయి. వేరే ఏదైనా పక్షి గుడ్లో? లేదా పాము గుడ్లో అని అనుకుంటున్నారా? అలా అనుకుంటే 'గుడ్డు'పై కాలేసినట్లే! ఎందుకంటే.. ఇవన్నీ కోడిగుడ్లే మరి. కేరళ మలప్పురంలోని ఏఆర్ నగర్ ప్రాంతానికి చెందిన సమద్ అనే వ్యక్తి ఇంట్లో ఉన్న ఐదేళ్ల వయసు ఉన్న కోడిపెట్ట ఇలా వింత ఆకారంలో గుడ్లు పెడుతోంది. ద్రాక్ష పండ్ల సైజులో ఉన్న ఈ కోడిగుడ్లలో తెల్లసొన మాత్రమే ఉండి... పచ్చ సొనలేకపోవడం మరో విశేషం.
Small eggs in kerala: కొన్నిరోజుల క్రితం వరకు తమ కోడి మామూలు సైజులోనే గుడ్లను పెట్టేదని సమద్ చెప్పారు. అయితే.. ఇటీవల కొద్దిరోజులుగా ఇలా చాలా చిన్న సైజులో గుడ్లను పెడుతోందని అన్నారు. ఇప్పటివరకు తమ కోడి మొత్తం 9 చిన్న గుడ్లను పెట్టిందని వెల్లడించారు.
"నేను ఓ కోడిగుడ్డును పగలగొట్టి చూశాను. అందులో పచ్చసొన లేదు. కేవలం తెల్లసొన మాత్రమే ఉంది. దీనికి కారణమేంటో నాకూ తెలియదు. మా ఇంట్లో ఉన్న మిగతా కోడిగుడ్లకు పెట్టే ఆహారాన్నే ఈ కోడికీ పెడతాం. అయినా ఇలా వింత సైజులో గుడ్లు పెడుతోంది."