భారత్‌ను ఆర్థికంగా పరిపుష్ఠం చేయడానికి పేదరికం, నిరక్షరాస్యత, అవినీతి, సామాజిక రుగ్మతలను సమష్టి కృషితో రూపుమాపాల్సిన అవసరం ఉందన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. అదే స్వాతంత్ర్య సమరయోధులకు ఇచ్చే అసలైన నివాళి అని అభిప్రాయపడ్డారు. 75వ స్వాతంత్ర్య వేడుకలకు గుర్తుగా నిర్వహిస్తున్న 'ఆజాదీకా అమృత్ మహోత్సవ్' కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా ఫేస్బుక్లో ఈ మేరకు పోస్ట్ చేశారు.
"దేశ చరిత్రలో ఇదో చారిత్రక ఘట్టం. మహాత్మ గాంధీ సహా ఎందరో స్వాతంత్ర్య యోధుల వారసత్వాన్ని, విలువలను స్మరించుకునేందుకు గొప్ప అవకాశం. వారి స్ఫూర్తి, త్యాగాలు, ఆదర్శాలను గుర్తుచేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. దండి మార్చ్ యావద్దేశాన్ని చైతన్యపరిచింది. దేశంలోని వీరులపై యువతకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. వలస పాలన విముక్తికి వేలాది మహిళలు, పురుషులు ఎలా ధైర్యవంతంగా ముందుండి పోరాడారో వారికి తెలియాలి."