ముఖ్యమంత్రి యడియూరప్ప ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన కొత్త చట్టం.. అక్కడి జంతు ప్రదర్శనశాలల్లోని మాంసాహార జంతువులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మైసూర్ జంతు ప్రదర్శనశాలలో ఆయా జంతువులకు ఆకలి కష్టాలు మొదలయ్యాయని అక్కడి సిబ్బంది పేర్కొంటున్నారు. గోవధ నిషేధ చట్టంతో మాంసాహార జంతువులకు చికెన్ మాత్రమే ఇవ్వగలుగుతున్నామని, ఒక్కసారిగా ఆహారంలో మార్పుతో అలవాటుపడలేక బలహీనంగా మారుతున్నట్లు చెప్పారు.
మైసూర్ 'జూ'లో.. సింహం, పులి, చిరుతపులి, మొసలి, హైనా, ఆఫ్రికన్ చిరుత వంటి మాంసాహార జంతువులు ఉన్నాయి. వాటికి మొదటి నుంచి బీఫ్ (గొడ్డు మాంసం) పెట్టేవారు. అయితే.. యడియూరప్ప సర్కార్ ఇటీవల తీసుకొచ్చిన చట్టంతో కేవలం పౌల్ట్రీ మాంసానికే పరిమితమైనట్లు అక్కడి సిబ్బంది తెలిపారు.