తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అందనంత ఎత్తులో ఉన్నత విద్య - college fee hike

విద్యాసంస్థలు కోర్సు రుసుములను నానాటికీ భారీగా పెంచడం మూలంగా సామాన్యులపై రుసుముల పెనుభారం పడుతోంది. బడుగు బలహీన వర్గాల్లో అధికశాతం విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్వహించే యూనివర్సిటీలు, కళాశాలల్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్నారు. ప్రభుత్వం కల్పించే రాయితీల ద్వారా ఈ వర్గాల గ్రామీణ ప్రాంత విద్యార్థులు అధికంగా లబ్ధి పొందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యూనివర్సిటీల రుసుముల పెంపు ఈ వర్గాలపై పెనుభారంగా పరిణమిస్తుంది.

Fee hike
University fee hike

By

Published : Oct 23, 2021, 5:34 AM IST

Updated : Oct 23, 2021, 6:53 AM IST

మనదేశంలో ఉన్నత విద్య సామాన్యులు భరించలేనంత భారంగా మారుతోంది. విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థలు కోర్సు రుసుములను భారీగా పెంచుతుండటం వల్ల పేద విద్యార్థులు ఉన్నతవిద్యకు దూరమవుతున్నారు. ప్రైవేటు విద్యా సంస్థల్లోనే కాకుండా, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో విద్యాభ్యాసమూ ఆర్థిక భారంగా పరిణమిస్తోంది. ఇంజినీరింగ్‌ వార్షిక రుసుమును రూ.20-50 వేల నుంచి ఏకంగా రెండు లక్షల రూపాయలకు, ఎంటెక్‌ కోర్సు రుసుమును సైతం భారీగా పెంచుతూ ఐఐటీ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకుంది. ఐఐఎంలు కూడా రెండేళ్ల మేనేజ్‌మెంట్‌ కోర్సు రుసుమును సగటున 13శాతం వరకు పెంచాయి. ఫలితంగా ప్రతిష్ఠాత్మక సంస్థల్లో మేనేజ్‌మెంట్‌ కోర్సు చదివేందుకు విద్యార్థులు రూ.13.7 లక్షల నుంచి రూ.20.7 లక్షలదాకా చెల్లించవలసి ఉంటుంది. తెలంగాణలోని జేెఎన్‌టీయూహెచ్‌, ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాలు బీటెక్‌, బీఫార్మసీ రెగ్యులర్‌ కోర్సుల రుసుములను రూ.18 వేల నుంచి రూ.35 వేలకు, సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సుల రుసుములను రూ.35 వేల నుంచి రూ.70 వేలకు పెంచాయి. ఇతర కోర్సుల రుసుములను సైతం భారీగా పెంచేందుకు విశ్వవిద్యాలయాలు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాయి. పాలకమండలి ఆమోదంతో కోర్సు రుసుములను పెంచుకోవచ్చని ప్రభుత్వం అనుమతించడంతో విశ్వవిద్యాలయాలు రుసుములు పెంచడంలో పోటీ పడుతున్నాయి.

తడిసి మోపెడవుతున్న వ్యయం

దేశ జనాభాలో కేవలం 27.1 శాతమే ఉన్నతవిద్యా కోర్సుల్లో చేరుతున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం, దేశంలో డిగ్రీ చదివినవారు 8.15శాతం ఉన్నారు. ఎస్సీల్లో 23.4శాతం, ఎస్టీల్లో 18శాతం మాత్రమే ఉన్నత విద్యకు చేరువ అవుతున్నట్లు అఖిల భారత సర్వే-2019-20 నివేదిక వెల్లడిస్తోంది. బడుగు బలహీన వర్గాల్లో అధికశాతం విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్వహించే యూనివర్సిటీలు, కళాశాలల్ల్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్నారు. ఉన్నత విద్యారంగానికి ప్రభుత్వం కల్పించే రాయితీల ద్వారా ఈ వర్గాల గ్రామీణ ప్రాంత విద్యార్థులు అధికంగా లబ్ధి పొందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యూనివర్సిటీల రుసుముల పెంపు ఈ వర్గాలపై పెనుభారంగా పరిణమిస్తుంది. 2019-20 ఆర్థిక సర్వే కూడా రుసుముల పెంపుతో పేద విద్యార్థులు చదువులకు దూరమవుతున్నారని పేర్కొంది. దేశంలో మూడు నుంచి 35 సంవత్సరాల వయసు వారిలో 13.6శాతం ఆర్థిక, తదితర కారణాలతో విద్యాసంస్థల్లో పేర్లు నమోదు చేసుకోవడం లేదని వెల్లడించింది. రుసుముల పెంపుపై ధర్నాలు, ఉద్యమాలు, కోర్టు కేసులు నామమాత్ర ప్రభావాన్నే చూపుతున్నాయి. అసోచామ్‌ సర్వే ప్రకారం దేశంలో 65శాతం తల్లిదండ్రులు నెలసరి జీతంలో సగం కంటే ఎక్కువగా తమ పిల్లల విద్యకోసమే వ్యయం చేస్తున్నారు. ఒక విద్యార్థిపై చేసే వ్యయం 2005లో రూ.35 వేలు ఉండగా 2011 నాటికి అది రూ.94 వేలకు పెరిగినట్లు వెల్లడైంది. పాఠశాల విద్య నుంచి డిగ్రీ స్థాయికి వచ్చేవరకు ఒక విద్యార్థికి నాణ్యమైన విద్య అందించేందుకు తల్లిదండ్రులు సరాసరిన రూ.18 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఖర్చు చేయవలసి వస్తోంది.

కొరవడిన సమన్యాయం

ప్రభుత్వం ఉన్నత విద్య గ్రాంట్లు తగ్గించడంతో విశ్వవిద్యాలయాలు కోర్సు రుసుములను, ఇతర ఫీజులను పెంచక తప్పడం లేదు. వర్సిటీలు ఆదాయం కోసం పలురకాల రుసుముల్ని పెంచడం, పరిశ్రమలు ఇతర ప్రైవేటు సంస్థలతో భాగస్వామ్యాన్ని ఏర్పరచుకోవడం వంటి చర్యలకు ఉపక్రమిస్తున్నాయి. మరోవైపు ఖర్చుల భారం తగ్గించుకొనేందుకు శాశ్వత బోధనా సిబ్బందిని నియమించకుండా ఒప్పంద, తాత్కాలిక సిబ్బందితో తరగతులు నిర్వహిస్తున్నాయి. కేంద్ర విద్యాశాఖ గణాంకాల ప్రకారం కేంద్ర విశ్వవిద్యాలయాల్లో సుమారు 32.7శాతం అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల విషయంలో తెలంగాణలో 1066, ఆంధ్రప్రదేశ్‌లో 1019 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని అధికారిక గణాంకాలే వెల్లడిస్తున్నాయి. ఉన్నత విద్యలో వ్యాపార ధోరణి పెరగడం వల్ల బోధనలో ఆధునిక సాంకేతిక పద్ధతులను ప్రవేశపెట్టడం, పరిశోధనలు నవకల్పనలు విస్తృతం కావడం, వృత్తి విద్యా కోర్సులు పెరగడం, నూతన రంగాల్లో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం వంటి గుణాత్మక మార్పులు వచ్చాయి. ఇలాంటి అనుకూల ఫలితాలతో పాటు చదువులకయ్యే వ్యయాలూ పెరిగాయి. ఉన్నత విద్యా విస్తృతిలో సమన్యాయం దెబ్బతిని, అల్పాదాయ వర్గాలకు అందని ద్రాక్షలా మారింది. యువతకు నాణ్యమైన విద్య, ఆధునిక నైపుణ్యాలను అందించినప్పుడే డిజిటల్‌ ఇండియా, స్కిల్‌ ఇండియా వంటి ప్రతిష్ఠాత్మక ప్రభుత్వ పథకాలు విజయవంతమవుతాయి. భారత కంప్ట్రోలర్‌ ఆడిటర్‌ జనరల్‌-2019 నివేదిక ప్రకారం... మాధ్యమిక, ఉన్నత విద్య సెస్‌ ద్వారా సమకూరిన నిధులు, పరిశోధన, అభివృద్ధి సెస్‌ ద్వారా వసూలైన మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేయలేదు. ఈ నిధులను తక్షణమే వినియోగిస్తే ఉన్నత విద్యారంగంపై ఆర్థిక భారం కొంతమేర తగ్గుతుంది. ప్రభుత్వాలు ఓటుబ్యాంకు రాజకీయాలకు, ప్రజాకర్షణ పథకాలకు, ఉచిత తాయిలాలకు ఖర్చు చేసే నిధుల్లో కొంతశాతం ఉన్నత విద్య వైపు మళ్ళిస్తే అందరికీ విద్యావకాశాలు దక్కుతాయి. ఉన్నత విద్య చదివే బడుగు బలహీన, అల్పాదాయ వర్గాలకు చెందిన విద్యార్థులకు అధిక రాయితీలను కల్పించాలి. ప్రభుత్వ హామీతో సులభంగా విద్యా రుణాలు సమకూర్చాలి. ఈ వర్గాలు ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక సమస్యల శాశ్వత పరిష్కారానికి, సాధికారత కల్పనకు, ఉజ్జ్వల భవిష్యత్తుకు సమ్మిళిత ఉన్నత విద్యే మేలైన మార్గం.

ప్రైవేటు బాటలో...

ఉన్నత విద్యారంగంలో ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తూ ప్రభుత్వాలు సంస్కరణల బాట పట్టాయి. వర్సిటీలు, కళాశాలలకు, ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్లు, రాయితీలపై పరిమితులు విధించాయి. సెల్ఫ్‌ ఫైనాన్సింగ్‌ కోర్సులతో వనరులు సమకూర్చుకొనేందుకు ఆమోదం తెలపడం ద్వారా ఉన్నత విద్యను ప్రైవేటు బాట పట్టిస్తున్నాయి. సరళీకృత ఆర్థిక విధానాల అమలు కారణంగా నైపుణ్య విద్యకు డిమాండ్‌ పెరిగింది. ఇతర దేశాల్లో ఉపాధి అవకాశాలు అధికమయ్యాయి. ఉన్నత విద్య ప్రాధాన్యాన్ని ప్రజలు గుర్తించారు. అందుకు అనుగుణంగా స్పందించడంలో ప్రభుత్వం విఫలమయింది. దాంతో ఉన్నత విద్యారంగం ప్రైవేటు విద్యాసంస్థల గుప్పిట్లోకి చేరింది. జపాన్‌, కొరియా పటిష్ఠమైన ప్రైవేటు విద్యాసంస్థల ద్వారా ఉన్నత విద్యను అందిస్తున్నాయి. ఇండొనేసియా, మలేసియాల్లో ప్రైవేటు ఉన్నత విద్యాసంస్థలపై ప్రభుత్వ నియంత్రణ అధికంగా ఉంటుంది. చైనా ఉన్నత విద్య చట్టాన్ని ఆమోదించడం ద్వారా యూనివర్సిటీలకు న్యాయపరమైన రక్షణను, స్వేచ్ఛను కల్పించింది.

- డాక్టర్‌ సీహెచ్‌సీ ప్రసాద్‌

ఇదీ చూడండి:'ఆన్‌లైన్‌ విద్యకు ప్రపంచ రాజధానిగా భారత్‌'

Last Updated : Oct 23, 2021, 6:53 AM IST

ABOUT THE AUTHOR

...view details