Arpita Mukherjee TMC: బంగాల్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్టులు కలకలం సృష్టిస్తున్నాయి. ఉపాధ్యాయ నియామక కుంభకోణంలో శనివారం ఒక్కరోజే దర్యాప్తు సంస్థ అధికారులు.. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత పార్థా ఛటర్జీ.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అత్యంత విశ్వసనీయమైన వ్యక్తి కావడం గమనార్హం. ఛటర్జీ సన్నిహితురాలు, సినీనటి అర్పితా ముఖర్జీ, ఆయన వ్యక్తిగత కార్యదర్శి సుకాంతా ఆచార్య కూడా అరెస్టయ్యారు. పార్థా ఛటర్జీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా కొనసాగిన 2014-2021 మధ్య కాలంలో ఉపాధ్యాయ నియామకాల్లో భారీ అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి శుక్రవారం జరిపిన సోదాల్లో అర్పితా ముఖర్జీ నివాసంలో లభించిన నగదు రూ.21 కోట్లుగా ఈడీ వెల్లడించింది. కేసు దర్యాప్తులో భాగంగా శుక్రవారం ఉదయం నుంచి 26 గంటల పాటు ఛటర్జీని ఆయన నివాసంలో ప్రశ్నించిన అధికారులు శనివారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం రెండు రోజుల పాటు ఈడీ కస్టడీకి అనుమతించింది. ఆ తర్వాత తన ఆరోగ్యం సరిగా లేదని ఛటర్జీ తెలపడంతో ఆయనను శనివారం సాయంత్రం ఎస్‌ఎస్‌కేఎం ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు.
ఛటర్జీ అరెస్టుపై తృణమూల్ కాంగ్రెస్ స్పందించింది. మంత్రిని కోర్టు దోషిగా ప్రకటిస్తే ఆయనపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. మంత్రి అరెస్టుపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒక ప్రకటన చేయాలని భాజపా జాతీయ ఉపాధ్యక్షుడు దిలీప్ ఘోష్ డిమాండ్ చేశారు. తృణమూల్ కాంగ్రెస్ అవినీతిలో కూరుకుపోయిందని మంత్రి అరెస్టు నిరూపించిందని ధ్వజమెత్తారు.
మోనాలిసా దాస్‌పైనా ఈడీ నిఘా!