ప్రముఖ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థ 'మణప్పురం ఫైనాన్స్' కార్యాలయాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ సోదాలు జరిపింది. మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా బుధవారం కేరళలోని నాలుగు చోట్ల ఈ దాడులు చేసింది. త్రిస్సూర్‌లోని కంపెనీ ప్రధాన కార్యాలయంతో పాటు ఆ సంస్థకు చెందిన ప్రమోటర్లకు సంబంధించి మొత్తం 4 చోట్ల ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ అధికారులు తనిఖీలు జరిపారు.
రిజర్వు బ్యాంకు మార్గదర్శకాలకు విరుద్ధంగా.. ప్రజల నుంచి మణప్పురం ఫైనాన్స్ సంస్థ రూ.150 కోట్లు డిపాజిట్లు సేకరించిందని ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో మరిన్ని ఆధారాలు సంపాదించేందుకు ఈ సోదాలు జరిపినట్లు ఈడీ అధికార వర్గాలు వెల్లడించాయి. ఆ సంస్థ భారీ స్థాయిలో నగదు లావాదేవీలు జరిపినట్లు అనుమానిస్తున్నట్లు తెలిపాయి. ఇందుకు సంబంధించి దస్త్రాలను సేకరించి, కంపెనీ ప్రతినిధుల స్టేట్మెంట్లు రికార్డు చేయాలని భావిస్తున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ వర్గాలు వివరించాయి. ఈడీ సోదాలపై మణప్పురం ఫైనాన్స్ సంస్థ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.
టీఎంసీ ఎమ్మెల్యే ఇంటిపై ఈడీ దాడులు
బంగాల్లోని రాయ్‌గంజ్ టీఎంసీ ఎమ్మెల్యే కృష్ణ కల్యాణి ఇంటిపైనా దాడులు నిర్వహించింది ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్. బుధవారం ఉదయం ఆయన నివాసం సహా కార్యాలయం, షోరూంలో సోదాలు జరిపారు అధికారులు. ఈ సోదాలకు కారణం వెల్లడించలేదు ఈడీ. అయితే, ఇదివరకే ఫుడ్స్, ఎడిబుల్ ఆయిల్ కంపెనీ, కోల్‌కతా కేంద్రంగా నడిచే రెండు టీవీ ఛానల్స్ మధ్య జరిగిన నగదు లావాదేవీ వ్యవహారంలో ఆయనకు నోటీసులు అందజేసింది.