Delhi Liquor Scam Case Updates: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్లీ మద్యం కేసులో రోజుకో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఈ కేసులో హైదరాబాద్కు చెందిన అరుణ్ రామచంద్ర పిళ్లైని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇక అరుణ్ పిళ్లైకు దిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు వారం రోజులు ఈడీ కస్టడీకి ఇచ్చింది. అయితే అరుణ్ పిళ్లై రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలను ఈడీ బయట పెట్టింది. 17 పేజీలతో అరుణ్ పిళ్లై రిమాండ్ రిపోర్టు రూపొందించింది.
MLC Kavitha in Delhi Liquor Scam Case ఆ నివేదికలో కీలక విషయాలు వెల్లడించింది. ఈ దిల్లీ మద్యం కుంభకోణం... ఎమ్మెల్సీ కవితకు లబ్ధి కలిగించేందుకు అన్నీ తానై అరుణ్ పిళ్లై వ్యవహరించారని ఈడీ ఆరోపించింది. సౌత్ గ్రూప్ మొత్తాన్ని అరుణ్ పిళ్లై దగ్గరుండి నడిపించారని నివేదికలో ఈడీ పేర్కొంది. సౌత్ గ్రూపులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఉన్నారని తెలిపింది. సౌత్ గ్రూపులో అరబిందో ఫార్మా ప్రమోటర్ శరత్ రెడ్డి సహా... వైసీపీ ఎంపీ మాగుంట, కుమారుడు రాఘవ్ ఉన్నారని వివరించింది. సౌత్ గ్రూపు ప్రతినిధులు అరుణ్ పిళ్లై, అభిషేక్, బుచ్చిబాబు ఉన్నట్లు పేర్కొంది.