ED Focus on Telangana Private Medical Colleges :రాష్ట్రంలోనివైద్య కళాశాలల్లో పీజీ సీట్ల వ్యవహారంపై ఈడీ అధికారులు దృష్టిసారించారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో ఈడీ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. ఈ సోదాలు ఈరోజు కూడా కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం హైదరాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, ఖమ్మం, రంగారెడ్డి, నల్గొండ తదితర ప్రాంతాల్లోని వైద్య కళాశాలలతోపాటు నిర్వాహకుల కార్యాలయాలు, ఇళ్లల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించారు.
హైదరాబాద్‌లో మల్లారెడ్డి, కామినేని, మెడిసిటీ, ప్రతిమ సంస్థ కార్పొరేట్ కార్యాలయం, కరీంనగర్‌లోని ప్రతిమ, మహబూబ్‌నగర్‌లోని ఎస్వీఎస్, నల్గొండలోని కామినేని, ఖమ్మంలోని మమత, రంగారెడ్డిలోని పట్నం మహేందర్‌రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, సంగారెడ్డిలోని ఎంఎన్ఆర్ వైద్య కళాశాలల్లో ఈ సోదాలు జరిగాయి. ప్రైవేటు వైద్య కళాశాలల నిర్వాహకులు పీజీ సీట్లను ప్రణాళిక ప్రకారం బ్లాక్ చేసి.. భారీ మొత్తానికి విక్రయించారంటూ కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయ అధికారులు.. గతేడాది ఏప్రిల్‌లో వరంగల్ కమిషనరేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మట్టేవాడ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగానే తాజాగా ఈడీ అధికారులు రంగంలోకి దిగారు.
ED Raids On Telangana Medical Colleges : సీట్లు అమ్ముకున్న సొమ్ముతో మనీలాండరింగ్‌కు పాల్పడ్డారనే కోణంలో దర్యాప్తుఆరంభించింది. వందల కోట్లు చేతులు మారి ఉంటాయని అనుమానిస్తున్న ఈడీ.. ఆ సొమ్మును ఎక్కడికి మళ్లించారనే విషయంపై కూపీ లాగుతోంది. సోదాలు ఇవాళ కూడా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని కొన్ని ప్రైవేటు వైద్య కళాశాలలు.. కొందరు మెరిట్ విద్యార్థులు, దళారులతో కుమ్మక్కై.. పీజీ సీట్ల బ్లాకింగ్ దందాకు పాల్పడ్డాయనేది ప్రధాన ఆరోపణ. ముందుగానే ఓ కళాశాలలో కన్వీనర్ కోటాలో పీజీ సీటు పొందిన విద్యార్థి.. మరో కళాశాలలోనూ చివరి విడత కౌన్సెలింగ్ వరకు సీటు బ్లాక్ చేయడమే ఈ దందాలో కీలకం. అలా చివరి వరకు ఆ సీటు బ్లాక్ అయి ఉండటంతో మిగిలిన విద్యార్థులు ఆ సీటు పొందే అవకాశం ఉండదు.