తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ నేతలపై ఈడీ దాడులు.. రాజకీయ కుట్రేనన్న సీఎం - కాంగ్రెస్​ నాయకులపై ఈడీ దాడులు

ఛత్తీస్​గఢ్​లో అధికార కాంగ్రెస్​ పార్టీ నాయకుల ఇళ్లల్లో ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాడులు జరుపుతోంది. బొగ్గు కుంభకోణానికి సంబంధించి ఈ సోదాలు చేస్తున్నామని అధికారులు తెలిపారు. అయితే మరో నాలుగు రోజుల్లో రాయ్​పుర్​లో ప్రారంభమయ్యే కాంగ్రెస్​ పార్టీ 85వ ప్లీనరీ సమావేశాలకు ముందు ఈ తనిఖీలు జరపడం తీవ్ర చర్చకు దారి తీస్తోంది.

ED Raids On Congress Leaders
కాంగ్రెస్​ నాయకులపై ఈడీ దాడులు

By

Published : Feb 20, 2023, 4:15 PM IST

ఛత్తీస్​గఢ్​లో కాంగ్రెస్​ నాయకుల నివాసాల్లో ఈడీ దాడులు అక్కడి రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బొగ్గు లెవీ మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోమవారం ఛత్తీస్‌గఢ్‌లోని పలు కాంగ్రెస్​ నాయకుల ఇళ్లతో పాటు కార్యాలయాల్లో సోదాలు జరిపింది. కాంగ్రెస్​ పార్టీ ప్లీనరీ సమావేశాలు జరిగే కొద్దిరోజుల ముందు ఈ దాడులు జరగడం రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీస్తోంది.

కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన ఛత్తీస్​గఢ్​లో ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ విస్తృత సోదాలు నిర్వహిస్తోంది. మైనింగ్ కేసు, బొగ్గు కుంభకోణానికి సంబంధించి ఛత్తీస్​గఢ్ వ్యాప్తంగా 12కు పైగా ప్రాంతాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. పలువురు కాంగ్రెస్ నాయకుల నివాస సముదాయాలు, కార్యాలయాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. రాయ్​పుర్​లో ఈనెల 24 నుంచి 26 వరకు 3రోజుల కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశాల జరగడానికి ముందు ఈ దాడులు చేయడం చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యే దేవేంద్ర యాదవ్​కు చెందిన రాయ్​పుర్​లోని ఆయన నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. గత నెలలోనూ ఇదే కేసులో ఓ ఐఏఎస్​ అధికారి నివాసం సహా వివిధ ప్రాంతాల్లో ఈడీ తనిఖీలు చేసింది. అప్పటి తనిఖీల్లో 2009 బ్యాచ్​కు చెందిన ఐఏఎస్ అధికారి సమీర్ విష్ణోయ్ నివాసంలో రూ.47 లక్షల నగదు, 4 కిలోల బంగారు ఆభరణాలను అధికారులు గుర్తించారు.

రవాణా చేసిన ప్రతి టన్ను బొగ్గుపై.. ఛత్తీస్​గఢ్​లోని పలువురు సీనియర్ అధికారులు, వ్యాపారులు, రాజకీయ నాయకులు.. రూ.25 అక్రమ పన్ను వసూలు చేశారని ఈడీ ఆరోపించింది. బొగ్గు లెవీ కుంభకోణం రూపంలో గత 2ఏళ్లలో రూ.450 కోట్ల భారీ దోపిడీ కుట్ర జరిగిందన్న ఐటీ శాఖ ఫిర్యాదు ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తోంది. ఛత్తీస్​గఢ్ సీఎం భూపేష్ బఘేల్ డిప్యూటీ సెక్రటరీ సౌమ్యా చౌరాసియా, విష్ణయ్ సహా 9మందిని ఈ కేసులో ఇప్పటికే ఈడీ అరెస్ట్ చేసింది.

ఈడీ దాడుల్ని ముఖ్యమంత్రి బఘేల్ తప్పుబట్టారు. "ఈ నెల 24 నుంచి 26 వరకు మూడు రోజుల పాటు రాయ్​పుర్​లో కాంగ్రెస్​ పార్టీ 85వ ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలు జరగకుండా ఆపేందుకే బీజేపీ ఇటువంటి చర్యలకు దిగుతోంది. ఈ దాడులను రాజకీయ ప్రేరేపిత చర్యగానే భావిస్తున్నాం. బీజేపీ.. కాంగ్రెస్​ నాయకత్వాన్ని చూసి భయపడుతోంది. రాజకీయ ప్రత్యర్థుల గొంతుకను అణిచివేసేందుకు దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోంది" అని ఛత్తీస్​గఢ్​ సీఎం మండిపడ్డారు.

"ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్​ అధినేత చేపట్టిన భారత్​ జోడో యాత్ర విజయవంతం అవ్వడం చూసి భయపడింది. మళ్లీ ఇప్పుడు ఈ భారీ బహిరంగ సభతో పాటు అదానీ వ్యవహారంలో భయపడుతోంది. అందుకే ఇటువంటి చిల్లర చర్యలకు దిగుతోంది. అయినప్పటికీ మేము ఇలాంటి చర్యలకు భయపడము. మేము ఆంగ్లేయులకే భయపడనప్పడు బీజేపీకి ఎందుకు భయపడాలి?"
-ఛత్తీస్​గఢ్ సీఎం భూపేష్ బఘేల్

ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లీనరీని విజయవంతం చేస్తామని బఘేల్​ ధీమా వ్యక్తం చేశారు. ఈ దాడితో ప్రజల దృష్టి మరల్చలేరని.. పౌరులకు నిజం తెలుసని, తాము పోరాడి గెలుస్తామని సీఎం ట్వీట్​ చేశారు. ఈ దాడులకు నిరసనగా రాయ్‌పుర్‌లోని ఈడీ కార్యాలయాన్ని కాంగ్రెస్‌ నేతలు చుట్టుముట్టారు.

ABOUT THE AUTHOR

...view details