తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కాంగ్రెస్​ నేతలపై సీబీఐ.. శివసైనికులపై ఈడీ.. దేశవ్యాప్తంగా కేంద్ర సంస్థల సోదాలు - మహారాష్ట్ర ఈడీ వార్తలు

దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థలు తనిఖీలు చేపట్టాయి. మహారాష్ట్ర మంత్రి, శివసేన నేత పరాబ్​ నివాసంపై ఈడీ దాడులు చేపట్టింది. కర్ణాటక కాంగ్రెస్​ నేత డీకే శివకుమార్​పై ఛార్జ్​షీట్​ దాఖలు చేసింది. మరోవైపు ఝార్ఖండ్​ మాజీ మంత్రికి చెందిన నివాసం, కార్యాలయాలపై సీబీఐ దాడులు చేపట్టింది. చైనీయులకు వీసా కేసులో కార్తీ చిదంబరాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ ప్రశ్నిస్తోంది.

సీబీఐ ఈడీ

By

Published : May 26, 2022, 1:03 PM IST

కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐ గురువారం దేశవ్యాప్తంగా రైడ్లు నిర్వహించాయి. వివిధ ప్రాంతాల్లోని కాంగ్రెస్​ నేతలపై సీబీఐ దాడులు నిర్వహించగా.. మహారాష్ట్రలోని అధికార పార్టీ శివసేనకు చెందిన నేతల నివాసాల్లో ఈడీ తనిఖీలు చేపట్టింది. మరోవైపు గుజరాత్​లో సుమారు 35 నుంచి 40 ప్రాంతాల్లో ఆదాయపన్ను శాఖ సోదాలు చేపట్టింది. ఏసియన్​ గ్రానిటో ఇండియా సంస్థకు చెందిన కార్యాలయాల్లో రెయిడ్లు నిర్వహించింది.

ఈడీ దాడులు..: మనీలాండరింగ్​ ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి, శివసేన నేత అనిల్​ పరాబ్​కు చెందిన వివిధ ప్రదేశాలపై ఈడీ దాడులు చేపట్టింది. ముంబయి, పుణె నగరాల్లో సుమారు ఏడు చోట్ల ఈ రైడ్లు జరిపింది. తాజాగా మనీలాండరింగ్​ నివారణ చట్టం కింద మరో కేసును నమోదు చేసింది ఈడీ.

కేసు వివరాలు:దపోలీలో 2017లో రూ.1 కోటికి కొనుగోలు చేసిన స్థలాన్ని 2020లో ముంబయికి చెందిన ఓ కేబుల్​ ఆపరేటర్​కు పరాబ్​ విక్రయించారు. అయితే ఆ మధ్య కాలంలో అధికారుల అనుమతి లేకుండా అక్కడ పరాబ్​ ఓ రిసార్టును నిర్మించారని.. ఇందుకోసం రూ.6 కోట్లు వెచ్చించారని ఈడీ ఆరోపిస్తోంది. మరోవైపు కొంతకాలం క్రితం అంబానీ నివాసం ముందు పేలుడు పదార్థాల కేసులో నిందితుడిగా అరెస్ట్​ అయిన సచిన్​ వాజే.. పరాబ్​పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ కేసును ఈడీ ఇప్పటికే విచారణ చేపట్టింది. దాదాపు 50 మంది కాంట్రాక్టర్ల జాబితా ఇచ్చి వారి నుంచి రూ.2 కోట్ల చొప్పున వసూలు చేసుకుని రావాలని పరాబ్​ తనను ఆదేశించినట్లు వాజే ఈడీకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు.

  • కర్ణాటక కాంగ్రెస్​ అధ్యక్షుడు డీకే శివకుమార్​ సహా పలువురిపై ఈడీ ఛార్జ్​షీట్​ను దాఖలు చేసింది. మనీలాండరింగ్​ కేసులో శివకుమార్​ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆదాయపన్ను శాఖ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఈడీ.. ఈ దర్యాప్తు చేపడుతోంది. ఈ కేసులో విచారణను ఎదుర్కొంటున్న శివకుమార్​.. ప్రస్తుతం బెయిల్​పై ఉన్నారు.

సీబీఐ సోదాలు: 34వ నేషనల్ గేమ్స్​ స్కామ్​కు సంబంధించి ఝార్ఖండ్​ మాజీ మంత్రి, కాంగ్రెస్​ నేత బంధు టిక్రే నివాసంలో సీబీఐ సోదాలు నిర్వహించింది. క్రీడా శాఖ మంత్రిగా సేవలు అందించిన టిక్రే.. అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్​లో టిక్రేను ఎమ్మెల్యే పదవికి అనర్హులుగా ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. మరోవైపు.. రూ.50 లక్షలు తీసుకుని 263 మంది చైనీయులకు వీసాలు ఇప్పించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్​ ఎంపీ కార్తీ చిదంబరాన్ని సీబీఐ.. గురువారం ​దిల్లీలోని తన కార్యాలయంలో విచారించింది. ఈ నేపథ్యంలో కార్యాలయానికి వెళ్లేముందు స్పందించిన కార్తీ.. తనపై పెట్టిన కేసులన్నీ బోగస్​ అని, తాను ఒక్క చైనా జాతీయుడికి కూడా వీసాలు ఇప్పించలేదని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:కేంద్ర హోంశాఖలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు చివరి తేది ఎప్పుడంటే?

ABOUT THE AUTHOR

...view details