దిల్లీ ప్రభుత్వ మద్యం కుంభకోణం ఆరోపణల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దేశవ్యాప్త దాడులు చేపట్టింది. దేశంలోని 30 ప్రదేశాల్లో సోదాలు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దిల్లీతో పాటు ఉత్తర్ప్రదేశ్, పంజాబ్, హరియాణ, తెలంగాణ, మహారాష్ట్ర సహా పలు ప్రాంతాల్లో ఈ దాడులు కొనసాగుతున్నాయని వెల్లడించాయి. అయితే, ఈ కేసులో ప్రధానంగా వినిపిస్తున్న దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా ఇంట్లో దాడులు చేయడం లేదని సంబంధిత వర్గాలు చెప్పాయి. దిల్లీ, గురుగ్రామ్, లఖ్నవూ, హైదరాబాద్, ముంబయి, బెంగళూరు నగరాల్లో సోదాలు చేపట్టినట్లు వివరించాయి. మద్యం వర్తకులు ఉండే ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దిల్లీ, జోర్బాగ్లోని ఇండో స్పిరిట్స్ కంపెనీ ఎండీ సమీర్ మహేంద్రుకు సంబంధించిన ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయని ఈడీ వర్గాలు తెలిపాయి. ఆయన యూసీఓ బ్యాంకు నుంచి కోటి రూపాయలను ట్రాన్స్ఫర్ చేశారని ఈడీ ఆరోపిస్తోంది.
'ఈడీకీ ఏం దొరకదు'
తాజా సోదాలపై దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా స్పందించారు. తొలుత సీబీఐతో దాడులు చేయిస్తే వారికి ఏం లభించలేదని, ఇప్పుడు ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారని.. వారికీ ఏం దొరకదని తెలిపారు. దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేస్తున్న మంచి పనులను ఆపేందుకు చేసే ప్రయత్నాలే ఇవన్నీ అని విమర్శించారు. సీబీఐ, ఈడీలను ఉపయోగించినా సరే తమను అడ్డుకోలేరని సిసోదియా కేంద్రంపై ధ్వజమెత్తారు. ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి గత నెల సిసోదియా నివాసం సహా ఏడు రాష్ట్రాల్లో 31 చోట్ల సీబీఐ సోదాలు నిర్వహించింది.