ED Raid Senthil Balaji : మనీలాండరింగ్ కేసులో తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి వి.సెంథిల్ బాలాజీని అరెస్టు చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్. అనేక గంటల పాటు ఆయన్ను విచారించిన ఈడీ.. చివరకు అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది. మంగళవారం తమిళనాడు సచివాలయంలోని ఆయన కార్యాలయంతో సహా, చెన్నైలో మంత్రి ఇంట్లోనూ ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. తరువాత మంత్రిని సుదీర్ఘ కాలం పాటు ప్రశ్నించిన ఈడీ అధికారులు.. అర్ధరాత్రి తరువాత ఆయనను అదుపులోకి తీసుకున్నారు. బుధవారం ఆయనను ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచి, కస్టడీ కోరే అవకాశం ఉంది. మంత్రి అరెస్ట్ నేపథ్యంలో ఎలాంటి ఆందోళనలు చెలరేగకుండా కరూర్‌లో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు.
ఆసుపత్రిలో చేరిన మంత్రి
అంతకుముందు మంత్రి వి.సెంథిల్ బాలాజీని వైద్య పరీక్షల కోసం చెన్నై ఒమండూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సమయంలో మంత్రి తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. మంత్రి అరెస్టు గురించి తెలుసుకున్న తమిళనాడు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణియన్, క్రీడాశాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్, ఇంకా పలువురు డీఎంకే మంత్రులు, కార్యకర్తలు ఆసుపత్రికి చేరుకుని సెంథిల్ బాలాజీని పరామర్శించారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సెంథిల్ బాలాజీనిని టార్చర్ చేయడం వల్లనే.. ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని డీఎంకే పార్టీ నేతలు ఆరోపించారు.
"బీజేపీ బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతోంది. ఇలాంటి వాటికి మేము భయపడేది లేదు. మంత్రి వి.సెంథిల్ బాలాజీ ట్రీట్మెంట్ కొనసాగుతోంది. ఈడీ దాడులపై మేము న్యాయపోరాటం చేస్తాం."
- ఉదయనిధి స్టాలిన్, మంత్రి
"ఆసుపత్రిలో ఐసీయూలో ఉన్న బాలాజీని చూశాను. ఆయన అపస్మారక స్థితిలో ఉన్నారు. పిలిచినా పలకడం లేదు. ఆయన చెవుల్లోంచి రక్తం కారుతోంది. డాక్టర్లు ఈసీజీ వల్ల అలా జరిగిందని అంటున్నారు. కానీ సెంథిల్ బాలాజీని ఈడీ అధికారులు చిత్రహింసలకు గురిచేసినట్లు కనిపిస్తోంది."