ED Raid On Rohit Pawar Company :మహారాష్ట్ర స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకు కుంభకోణం దర్యాప్తులో భాగంగా ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ మనవడు రోహిత్ పవార్‌కు చెందిన బారామతి ఆగ్రో, అనుబంధ సంస్థలో శుక్రవారం ఈడీ దాడులు జరిపింది. బారామతి, పుణె, ఔరంగాబాద్, అమరావతితో సహా దాదాపు ఆరు ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగాయి.
అసలేం జరిగిందంటే?
మహారాష్ట్ర కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టర్ కొనుగోలు వేలంలో అవకతవకలు జరిగాయని బారామతి ఆగ్రో కంపెనీపై ముంబయి పోలీసులు 2019 ఆగస్ట్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ రంగంలోకి దిగింది. బారామతి అగ్రో కంపెనీకి చెందిన నిధులను అక్రమంగా మళ్లించారనే ఆరోపణల నేపథ్యంలో ఈడీ తనిఖీలు చేపట్టింది.
నాసిరకం మందులపై సీబీఐ విచారణ
దిల్లీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాసిరకం మందులు, వాటిని మొహల్లా క్లీనిక్‌లకు కూడా సరఫరా చేశారా? అనే అంశంపై CBI విచారణకు కేంద్ర హోం శాఖ ఆదేశించింది. గతేడాది దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సీబీఐ విచారణకు సిఫార్సు చేయటం వల్ల ఈ మేరకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. నాణ్యత పరీక్షల్లో ఫెయిల్ అయిన మందులను దిల్లీ ప్రభుత్వ ఆస్పత్రులకు సరఫరా చేశారని, అవి ప్రాణాలకే ప్రమాదమని లెఫ్టినెంట్ గవర్నర్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రులకు మందుల సరఫరాపై విచారణ జరిపించాలని దిల్లీ విజిలెన్స్ డైరెక్టరేట్ కేంద్రానికి లేఖ రాసింది. సెంట్రల్ ప్రొక్యూర్‌మెంట్ ఏజెన్సీ సేకరించిన ఆ మందులను మొహల్లా క్లీనిక్‌లకు కూడా సరఫరా చేశారా లేదో తేల్చాలని కోరింది.