ED questions Kharge: రాజ్యసభలో విపక్షనేత, కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున ఖర్గేను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు ప్రశ్నించారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక అవినీతి కేసులో భాగంగా ఆయనకు ఈడీ నోటీసులు పంపింది. సోమవారమే విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో దిల్లీలోని ఈడీ కార్యాలయానికి వచ్చిన ఖర్గేను ప్రశ్నించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేసినట్లు వెల్లడించాయి. విచారణలో పలు అంశాలపై స్పష్టత కోసం ఆయనను పిలిచినట్లు స్పష్టం చేశాయి.
అగస్టా కేసులో...:మరోవైపు, అగస్టా వెస్ట్‌లాండ్ చాపర్ కుంభకోణంలో కేసులో రక్షణ శాఖ మాజీ కార్యదర్శి, మాజీ కాగ్ శశికాంత్ శర్మకు సీబీఐ ప్రత్యేక కోర్టు సమన్లు పంపింది. వాయుసేనకు చెందిన నలుగురు విశ్రాత అధికారులతో పాటు సీబీఐ దాఖలు చేసిన అనుబంధ చార్జ్‌షీట్‌లో ఉన్న నిందితులందరికీ సమన్లు జారీ చేసింది. నిందితులంతా ఏప్రిల్ 28న తమ ముందు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
AgustaWestland Case:అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కుంభకోణంలో రక్షణశాఖ మాజీ కార్యదర్శి శశికాంత్ శర్మతో పాటు నలుగురు ఐఏఎఫ్ మాజీ అధికారులపై సీబీఐ మార్చి 17న అనుబంధ అభియోగపత్రం దాఖలు చేసింది. 2011-2013 మధ్య రక్షణ కార్యదర్శిగా పనిచేసిన శర్మ.. అనంతరం కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్‌గా నియమితులయ్యారు. ఆయనను ప్రాసిక్యూట్ చేసేందుకు ప్రభుత్వ అనుమతి పొందిన అనంతరం సీబీఐ చార్జ్‌షీట్ రూపొందించింది. ఇందులో అప్పట్లో వివిధ హోదాల్లో పనిచేసిన నలుగురు అధికారుల (ఎయిర్ వైస్ మార్షల్ జస్బీర్ సింగ్ పనేసర్, డిప్యూటీ చీఫ్ టెస్ట్ పైలట్ ఎస్.ఎ.కుంతే, వింగ్ కమాండర్ థామస్ మాథ్యూ, గ్రూప్ కెప్టెన్ ఎన్.సంతోష్) పేర్లు కూడా నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
12 వీవీఐపీ హెలికాప్టర్ల కొనుగోలులో అగస్టా వెస్ట్‌ల్యాండ్ కంపెనీకి అనుకూలంగా పనిచేసేందుకు ముడుపులు తీసుకున్న వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ హయాంలో ఈ ఒప్పందం కుదిరింది. అయితే, ఎన్డీఏ సర్కారు వచ్చిన తర్వాత ఈ ఒప్పందాన్ని రద్దు చేసింది.
ఇదీ చదవండి:రాముడి ఊరేగింపులో హింస.. అనేక రాష్ట్రాల్లో అవాంఛిత ఘటనలు